
- జిల్లా ప్రాజెక్టులకు కేంద్ర నిధుల వరద ..
- వంశధార, మహేంద్రతనయ, మడ్డువలసకు భారీగా కేటాయింపులు
- రెండేళ్లలో పనులు పూర్తిచేసేలా ప్రణాళిక
శ్రీకాకుళం: ఏళ్ల తరబడి సాగునీటి కోసం ఎదురుచూస్తున్న సిక్కోలు రైతాంగానికి శుభవార్త. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్వోదయం పథకం ద్వారా భారీగా నిధులను కేటాయించింది. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ. 14,100 కోట్లు వెచ్చిస్తుండగా, అందులో ఉత్తరాంధ్ర జిల్లాలకు, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ప్రత్యేకంగా రూ.5వేల కోట్లు కేటాయించారు. ఈ నిధులతో జిల్లాలోని వంశధార, నాగావళి, మహేంద్రతనయ వంటి జీవనదుల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులను వచ్చే రెండేళ్లలో పూర్తి చేసి, ప్రతి ఎకరానికీ నీరందించాలని ప్రభుత్వం సంకల్పించింది.
ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతోనే...
సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులపై ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనలో కేంద్రానికి ప్రత్యేక నివేదిక సమర్పించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలను అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. సీఎం విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్రం .. 'పూర్వోదయం'లో మన ప్రాజెక్టులను చేర్చింది. దీంతో జిల్లా దశ తిరగనుంది.
మహేంద్రతనయకు మహర్దశ..
జిల్లా రైతుల చిరకాల స్వప్నమైన 'మహేంద్రతనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్' పనులకు ఈసారి భారీ ఊరట లభించింది. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా రూ. 506.68 కోట్లు కేటాయించారు. దీనిద్వారా కొత్తగా 24,600 ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా మెళియాపుట్టి, పాతపట్నం, టెక్కలి ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీరనుంది.
నదుల అనుసంధానానికి మోక్షం..
జిల్లాలోని రెండు ప్రధాన నదులైన వంశధార-నాగావళి అనుసంధానం ప్రక్రియకు నిధుల కొరత తీరనుంది. ఈ లింక్ కెనాల్ పనులకు రూ. 72.50 కోట్లు కేటాయించారు. ఇది పూర్తయితే 5 వేల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు, మరో 18వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. గొట్టా బ్యారేజీ కుడి ప్రధాన కాలువ, వంశధార రెండో దశ పనులకు రూ. 171.91 కోట్లు, హిరమండలం రిజర్వాయర్‌కు రూ.176.35 కోట్లు కేటాయించారు. తద్వారా వంశధార ఆయకట్టు రైతులకు భరోసా లభించింది.
జల సిరుల 'సుజల స్రవంతి'..
ఉత్తరాంధ్ర జిల్లాల వర ప్రదాయిని 'ఉత్తరాంధ్ర సుజల స్రవంతి'కి ఈ పథకంలో అత్యధిక ప్రాధాన్యం దక్కింది. దీనికి రూ.2,672.2 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో పనులు వేగవంతమైతే జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు గోదావరి జలాలు అందుతాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.1.30 లక్షల ఎకరాలకు కొత్తగా నీరందే అవకాశం ఉంది.
మడ్డువలస, తోటపల్లికి భరోసా...
జిల్లాలో మరో కీలక ప్రాజెక్టుయిన మడ్డువలస రిజర్వాయర్ రెండో దశ పనులకు రూ.30.04 కోట్లు, నాగావళి-చంపావతి అనుసంధానానికి రూ.21.53 కోట్లు కేటాయించారు. అలాగే తోటపల్లి బ్యారేజీ పనులకు రూ. 263.36 కోట్లు కేటాయించడం ద్వారా ఉమ్మడి జిల్లాలోని రాజాం, ఎచ్చెర్ల తదితర నియోజకవర్గాల ఆయకట్టుకు మేలు జరగనుంది.