
అనకాపల్లి జిల్లాలో రోడ్లు, బ్రిడ్జిల దుస్థితిపై బీజేపీ జనతా వారధి కార్యక్రమం
అనకాపల్లి జిల్లాలో రహదారులు, బ్రిడ్జిలు దారుణ స్థితిలో ఉన్నాయని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి. పరమేశ్వరరావు సోమవారం అధికారిక లేఖను సమర్పించారు. ప్రజలు సురక్షిత రవాణా సౌకర్యాల కోసం ఎదురుచూస్తున్నారు కాబట్టి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం, చోడవరం–నర్సీపట్నం మార్గంలో వడ్డాదిలో పెద్దేరు మీద బ్రిడ్జి ఐదేళ్ల క్రితమే కూలిపోయింది. అలాగే విజయరామరాజుపేట సమీపంలో తాచేరు మీద ఉన్న మరో బ్రిడ్జి కూడా నాలుగేళ్ల క్రితం కూలిపోయినా ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టలేదని తెలిపారు. ఈ మార్గాలు జిల్లాలో కీలకమైనవిగా ఉన్నా, ప్రత్యామ్నాయ మార్గాలు దూరంగా ఉండటంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.రోడ్ల పరంగా కూడా అనేక ప్రాంతాల్లో దుస్థితి నెలకొని ఉందని బీజేపీ పేర్కొంది. అనకాపల్లి–చోడవరం రహదారి, చోడవరం–మాడుగుల ఘాట్ రోడ్, వడ్డాది జంక్షన్–నర్సీపట్నం వరకు ఉన్న రహదారులు పూర్తిగా గతుకులతో నిండిపోవడంతో ప్రమాదాలు కొనసాగుతున్నాయని తెలిపారు.మునుపటి ఎన్నికల సందర్భంగా ఈ మార్గాల్లో కొత్త బ్రిడ్జిలు, రోడ్ల నిర్మాణం చేస్తామన్న హామీలు ఇచ్చిన కూటమి పార్టీలు వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశంపై తక్షణ సమీక్షచేసి నిర్మాణ పనులు ప్రారంభించాలని పరమేశ్వరరావు కోరారు.ఈ లేఖను జిల్లా కలెక్టర్‌కు పరమేశ్వరరావుతోపాటు మేడివాడ కోపరేటివ్ చైర్మన్ మరియు రావికమతం బిజెపి మండల అధ్యక్షుడు గుటాల చిన్న, రావికమతం బిజెపి ప్రధాన కార్యదర్శి గంట సత్యనారాయణ పార్టీ నాయకులు జి. భానుమూర్తి, వి. కనకమహాలక్ష్మి, ఓ. నాగ, ఎస్. సుకత, టి. లీలా, ఎన్. కమల, కె.వి.వి.ఆర్. గణేష్, శేఖర్ బాబు తదితరులు కలిసి సమర్పించారు.