
వార్డు హద్దులను తుంగలో తొక్కి తప్పుడు ఓటర్ల నమోదు అక్రమ ఓటర్ లిస్టుల తయారీ వెనుక కాంగ్రెస్ పార్టీ కుట్ర !
ఖానాపూర్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీకర్ రాజు.
ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులలో వార్డు హద్దులను పూర్తిగా విస్మరించి, ఇతర ప్రాంతాలకు చెందిన తప్పుడు ఓటర్లను అక్రమంగా నమోదు చేసిన ఘటనపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఖానాపూర్ మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గౌరీకర్ రాజు మాట్లాడుతూ, ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లోనూ కాంగ్రెస్ పార్టీ నేతల ప్రత్యక్ష కనుసన్నల్లోనే వార్డు హద్దులను తుంగలో తొక్కి, బోగస్ ఓటర్లను అక్రమంగా చేర్చుతూ ఓటర్ లిస్టులను తయారు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో ప్రజల తీర్పును వక్రీకరించాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పథకబద్ధంగా ఈ అక్రమాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఇది కేవలం ఎన్నికల నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడిగా అభివర్ణించారు.
ఈ అంశంపై ఎన్నికల అధికారులు తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున న్యాయపోరాటంతో పాటు ప్రజా ఉద్యమాలకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన హెచ్చరించారు.