
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి
AIMA న్యూస్ బ్యూరో . జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ శనివారం రోజున తమ ఇలవేల్పు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తి పూర్వకంగా ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం 2024లో పవన్ కళ్యాణ్ ఆలయాన్ని సందర్శించారు. కొండగట్టు అంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని సందర్భంలో మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రూ. 35.19 కోట్ల అంచనా వ్యయంతో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో నేడు దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేశారు.ఉదయం 11 గంటల ప్రాంతంలో టి.టి.డి. ఛైర్మన్ బి.ఆర్.నాయుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తో కలసి ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కు తెలంగాణ దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శైలజా రామయ్యార్ ఆధ్వర్యంలో ఆలయ ఆర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రధాన స్థానాచార్యులు శ్రీ కపీంద్ర స్వామి పవన్ కళ్యాణ్ ను సంప్రదాయబద్దంగా ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ఇరువైపులా ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీ అమ్మవార్లకు అర్చనలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందించి, స్వామి వారి తీర్థ ప్రసాదం అందచేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఈవో టి. కాంతరావులు స్వామి వారి చితపటాన్ని పవన్ కళ్యాణ్ కు బహూకరించారు. టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు ,బోర్డు మెంబర్ ఆనందసాయి, తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ సలహదారు గోవింద్ హరే, తెలంగాణ జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, ఆర్ కె సాగర్ తదితరులు ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నారు