
"విజయనగరంలో ఉపాధ్యాయులకు 'లెక్కల మామయ్య'తో గణిత శిక్షణ: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శిబిరం"
ఈ నెల నాలుగో తేదీన విజయనగరం కంటోన్మెంట్ గురజాడ పాఠశాలలో హైదరాబాద్ వాస్తవ్యులు,ప్రసిద్ధి చెందిన లెక్కల ఉపాధ్యాయుడు చంద్రయ్య అలియాస్ లెక్కల మామయ్యతో ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులకు మ్యాథమెటిక్స్ పై ప్రత్యేకమైన శిక్షణ తరగతులు నిర్వహించబడునని జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు ఎరుకొండ ఆనంద్ తెలిపారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను బుధవారం కంటోన్మెంట్ గురజాడ పాఠశాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెవివి జిల్లా అధ్యక్షుడు ఆనంద్ మాట్లాడుతూ లెక్కల మామయ్యగా ప్రసిద్ధి చెందిన చంద్రయ్య అంకెల గారడీతో లెక్కలను సులభ పద్ధతులు విద్యార్థులకు ఏ విధంగా బోధించాలో శిక్షణనిస్తారని చెప్పారు.ఈ అవకాశాన్ని ఉమ్మడి విజయనగరం జిల్లాలకు చెందిన ప్రభుత్వ,ప్రైవేట్ ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ తరగతులు 4వ తేదీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ శిక్షణ తరగతులలో పాల్గొన్న ఉపాధ్యాయులకు మధ్యాహ్నం భోజన సదుపాయం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎంవిఆర్ కృష్ణాజి, జెవివి జిల్లా
పూర్వ అధ్యక్షుడు అల్లూరి శివ వర్మ, రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్ డప్పు శ్రీను, జిల్లా కోశాధికారి షిణగం శివాజీ,జిల్లా ప్రతినిధులు పి.షణ్ముఖరావు, సీరాపు శ్రీను పాల్గొన్నారు.