
అర్ధరాత్రి ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC బోగీలో వ్యక్తి సజీవ దహనం!
టాటా-ఎర్నాకుళం(18189) ఎక్స్‌ప్రెస్ ట్రైన్ అగ్ని ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అనకాపల్లి SP తుహిన్ సిన్హా ఘటనాస్థలాన్ని పరిశీలించారు
ప్రమాదంలో ఒకరు మృతిచెందనట్టు గుర్తించామని అన్నారు. చనిపోయిన వ్యక్తి 71 సంవత్సరాల వ్యక్తని, పెద్ద వయసుకావడంతో ఆయన బయటికి రాలేకపోయారని SP తెలిపారు. మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చామన్నారు. ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులకు వైద్య పరీక్షలు చేయించామని, వేరే ట్రైన్ కూడా ఏర్పాటు చేసి వారిని ఎర్నాకుళం పంపించామన్నారు. FSL రిపోర్ట్ తర్వాత పూర్తివివరాలు తెలుస్తాయని SP తుహిన్ సిన్హా మీడియాకు తెలిపారు.
B1 కోచ్ ఎలక్ట్రికల్ ప్యానల్ నుంచి మంటలు చేలరేగినట్టు ప్రాథమికంగా గుర్తించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. B1, M2 కోచ్‌ల్లో పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది అతికష్టంమీద వాటిని ఆర్పారు. మంటల దాటికి భారీగా పొగలు కమ్మేయడంతో రెస్క్యూ ఆపరేషన్ కష్టమైంది. రెస్క్యూ టీమ్స్ కోచ్ అద్దాలను పగలకొట్టి ప్రయాణికులను క్షేమంగా బయటికి తీసుకొచ్చారు. అందరూ గాఢనిద్రలో ఉండగా మంటలు చెలరేగాయి. కోచ్‌లో పోలీ మెటీరియల్, దుప్పట్లు ఉండటంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. అయితే, టీటీఈ, లోకో పైలట్ అప్రమత్తతతో భారీ ప్రాణనష్టం తప్పింది. అనకాపల్లి తర్వాత.. ఎలమంచిలి స్టేషన్ సమీపిస్తుండగా.. రైల్ బ్రేక్ జామ్ అయ్యింది. దాంతో, లోకో పైలట్ అప్రమత్తమయ్యాడు. వెనక్కి చూసేసరికి ఓ కోచ్ నుంచి మంటలను గమనించి ట్రైన్‌ను నిలిపివేశాడు. వెంటనే, ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో భారీ ప్రాణనష్టం తప్పిందని అన్నారు.
ఆదివారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రైల్లోని ప్యాంట్రీ కారును ఆనుకుని ఉన్న B1 కోచ్‌లో ముందుగా మంటలు చెలరేగాయి.. ఆ తర్వాత M2కి మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే.. B1, M2 కోచ్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే అప్పటికే, బోగీల నుంచి దిగి ప్రాణాలు కాపాడుకున్నారు ప్రయాణికులు. రైలు ప్రమాదంతో ఎలమంచిలి స్టేషన్ మొత్తం పొగ కమ్మేసింది. దాంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదంతో దాదాపు 2వేల మంది ప్రయాణికులు స్టేషన్‌లోనే పడిగాపులు పడ్డారు.