
జిల్లాస్థాయి తైక్వాండో టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను అభినందించిన డాక్టర్ రవి కృష్ణ.
నంద్యాల (శుభోదయం న్యూస్): ఇటీవల జరిగిన నంద్యాల జిల్లా స్థాయి తైక్వాండో ఓపెన్ టోర్నమెంట్ లో, కోచ్ లు సర్దార్, షానవాజ్ ల దగ్గర శిక్షణ పొంది విజేతలుగా నిలిచిన వివిధ పాఠశాలలకు చెందిన క్రీడాకారులను నంద్యాల క్రీడా సమాఖ్య కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ ఒలింపిక్ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ అభినందించారు.సర్దార్ అలీ ఖాన్, షానవాజ్ శిక్షణలో తర్ఫీదు పొందిన ఎస్ డి ఆర్ స్కూల్, బాలాజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్, బాల అకాడమీ, ఎల్ కె ఆర్ గ్లోబల్ స్కూల్, జ్యోతిర్మయి పాఠశాల, శ్రీ చైతన్య స్కూల్, ఉస్మానియా ఇంగ్లీష్ మీడియం స్కూల్, మున్సిపల్ హై స్కూల్ లకు చెందిన విద్యార్థులు వివిధ కేటగిరీలలో విజేతలుగా నిలిచి పతకాలు అందుకున్నారు.ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ తైక్వాండో వంటి మార్షల్ ఆర్ట్స్ క్రీడలలో విద్యార్థులు పాల్గొనడం ద్వారా శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం ఇనుమడిస్తుందని అన్నారు. క్రీడలలో విజయం సాధించడానికి మంచి కోచ్ ల పర్యవేక్షణలో క్రమశిక్షణతో కూడిన నిరంతర సాధన కీలక పాత్ర వహిస్తుందన్నారు. జిల్లాస్థాయిలో విజేతలుగా నిలిచిన వారు భవిష్యత్తులో రాష్ట్రస్థాయి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. అనేక సంవత్సరాలుగా తైక్వాండో లో శిక్షణ ఇస్తున్న కోచ్ లు సర్దార్, షానవాజ్ లను ప్రత్యేకంగా అభినందించారు.