
గౌతమ్, విజయ్‌లకు ఉచిత విద్య, సంరక్షణ బాధ్యతలు స్వీకరించేందుకు డాక్టర్ సీతామహాలక్ష్మి హామీ!
అనాథులుగా మిగిలిన గౌతమ్, విజయ్ లను సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ (స్పెక్ట్) తరఫున వారి సంక్షేమాన్ని చూసుకునే బాధ్యతలను మేము చూసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని,గ్రామ పెద్దలు అంగీకరిస్తే ఆ బాధ్యతలను తీసుకుంటామని సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి హామీ ఇచ్చినట్లు ఆ సంస్థ సభ్యుడు,జన విజ్ఞాన వేదిక జిల్లా కోశాధికారి షిణగం శివాజీ తెలిపారు. విజయనగరం జిల్లా జామి మండలం జన్నివలస గ్రామానికి చెందిన గౌతమ్, విజయ్ లు తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలిన విషయాన్ని తెలుసుకున్న డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి స్పెక్ట్ సంస్థ తరఫున ఆ చిన్నారులు ఒక్కొక్కరికీ మూడు జతలు చొప్పున నూతన వస్త్రాలను,నిత్యావసర సరుకులను, చిన్నారులు కప్పుకునేందుకు రగ్గులు,మంకీ క్యాప్ లను శనివారం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధి శివాజీ మాట్లాడుతూ గ్రామ పెద్దలు సమక్షంలో వీటిని అందజేయడం జరిగిందని తెలిపారు.అదేవిధంగా స్పెక్ట్ సంస్థ తరఫున పిల్లలకు విజయనగరంలో ఎక్కడైనా హాస్టల్లో చేర్పించి, ఉచిత విద్యను అందించేందుకు బాధ్యత తీసుకుంటామని గ్రామ పెద్దలకు తెలియజేయడం జరిగిందని చెప్పారు.ఈ కార్యక్రమంలో మాతృభూమి సేవా సంస్థ జిల్లా కార్యదర్శి ఇప్పలవలస గోపి, కాళ్ళ రామారావు, గ్రామ సర్పంచ్ సేరెడ్డి చంద్రీ నాయుడు, ఉప సర్పంచ్ వర్రి శ్రీను, డోల గణపతి తదితరులు పాల్గొన్నారు.