logo

చింతలపూడి పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి — దేవినేని ఉమా విజ్ఞప్తి

ఎన్టీఆర్ జిల్లా మంగళగిరి డిసెంబర్ 12 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

మంగళగిరి మెట్ట ప్రాంత రైతుల భవితవ్యాన్ని మార్చే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని అత్యవసర ప్రాధాన్యతతో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడిని కోరుతూ మాజీ మంత్రి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు సోమవారం విజ్ఞప్తి చేశారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసి ఈ ప్రాజెక్టు ప్రాధాన్యత, లాభాలను విపులంగా వివరించారు.
దేవినేని ఉమా మాట్లాడుతూ… చింతలపూడి పథకం మెట్ట రైతుల ఎన్నో దశాబ్దాల నాటి కల అని, గోదావరి జలాలు చేరితే ప్రాంతంలో సాగునీటి సమస్యలు శాశ్వతంగా తొలగి సస్యశ్యామలం అవుతుందని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ఉమ్మడి కృష్ణా, గోదావరిజిల్లాల్లో 4.80 లక్షల ఎకరాలకు సాగునీరు, 35 మండలాల 25 లక్షల మందికి త్రాగునీరు అందబోతుందని గుర్తు చేశారు.
గత టిడిపి ప్రభుత్వం ఈ భారీ పథకానికి శంకుస్థాపన చేసి వేగంగా పనులు ప్రారంభించి నప్పటికీ, తరువాత ఐదేళ్ల వైసీపీ పాలనలో అవినీతి, నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు పూర్తిగా నిలిచిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి వరకు ప్రభుత్వం రూ.4,170 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. దేవినేని ఉమా ప్రస్తావించిన అంశాలను సీఎం చంద్రబాబు శ్రద్ధగా విని స్పందించారు. చింతలపూడి ప్రాజెక్టు రైతుల సంక్షేమానికి, ఆర్థిక ప్రగతికి అత్యంత కీలకమని అంగీకరించిన ఆయన, గత ప్రభుత్వ అనర్హత వల్ల ఏర్పడ్డ అడ్డంకులను తొలగించి పథకాన్ని తిరిగి ప్రారంభించి వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రాంతీయ వ్యవసాయాభివృద్ధి, నీటి వనరుల సద్వినియోగంలో చింతలపూడి ప్రాజెక్టు ప్రధాన పాత్ర పోషిస్తుందని ఇద్దరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.

0
0 views