logo

||మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు||* *- విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్*


విజయనగరం పట్టణంకు చెందిన ఆటో డ్రైవర్లుతో జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ జిల్లా పోలీసు కార్యాలయం వద్ద డిసెంబరు 6న సమావేశమై, రహదారి భద్రత నియమాలు పాటించకున్నా, మద్యం సేవించి వాహనాలు నడిపిన చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయనగరం పట్టణం ఆర్టీసి కాంప్లెక్సు వద్ద ఆటోలను అస్తవ్యస్తంగా నిలిపి, ఇతర వాహనాలకు, ప్రయాణీకులకు ఇబ్బందులు కలిగిస్తున్న కారణంగా ఆటోలను విజయనగరం ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేయడంతో, ఆటో డ్రైవర్లు జిల్లా ఎస్పీని కలిసి, తమ ఇబ్బందులను తెలిపేందుకు పోలీసు కార్యాలయంకు రావడంతో, జిల్లా ఎస్పీ వారికి కౌన్సిలింగు నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ మాట్లాడుతూ - రహదారి భద్రత అందరి బాధ్యతని, ఆటో డ్రైవర్లు నిర్లక్ష్యం కారణంగా ఎక్కువగా రహదారి ప్రమాదాలు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఆటో డ్రైవర్లు నిబంధనలు మేరకు నడుచుకుంటే రహదారి ప్రమాదాలు తగ్గడమే కాకుండా, ట్రాఫిక్ అవాంతరాలు చాలా వరకు తగ్గుతాయన్నారు. ఆటో డ్రైవర్లు సమస్యలను మానవత దృక్పథంతో అర్ధం చేసుకొని, ఆటోలకు ఈ-చలానాలను విధించడం లేదన్నారు. కానీ, చాలా మది ఆటో డ్రైవర్లు రహదారి భద్రత నియమాలు పాటించడం లేదని, ఆర్టీసి కాంప్లెక్సు మరియు ఇతర ముఖ్య కూడళ్ళలో ఆటోలను అస్తవ్యస్తంగా నిలపడం వలన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో పాటు, ఇతర వాహనదారులకు, ప్రయాణికులకు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకే ఆర్టీసి కాంప్లెక్సు, ఎత్తు బ్రిడ్జి, దాసన్నపేట రైతు బజారు వద్ద నిర్లక్ష్యంగా పార్కింగు చేసిన ఆటోలను సీజ్ చేసామన్నారు. ఇకపై రహదారి భద్రత నియమాలు పాటిస్తే, సానుకూలంగా వ్యవహరిస్తామని, లేకుంటే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఆటో డ్రైవర్లును జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఆటోలకు రిజిస్ట్రేషను పత్రం, ఆటో నడిపేందుకు డ్రైవింగు లైసెన్సు, ప్రమదాల్లో గాయపడిన లేదా మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు ఇన్సూరెన్సు, కాలుష్యం నియంత్రణకు సొల్యూషను ధృవ పత్రం తప్పనిసరిగా ఉండాలన్నారు. పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణికులను అనుమతించవద్దని, డ్రైవరు సీటులోకి ప్రయాణికులను కూర్చోబెట్టవద్దని, ఆటో డ్రైవర్లు యూనిఫాం ధరించాలని, నిబంధనలకు విరుద్ధంగా స్కూలు పిల్లలను అనుమతించవద్దన్నారు. ప్రతీ అటో డ్రైవరు రహదారి భద్రత నియమాలు పాటించి, రహదారి ప్రమాదాలను నియంత్రించేందుకు పోలీసుశాఖకు సహకరించాలని కోరారు. ఆటోల్లో ప్రయాణించే మహిళలు, మైనరు బాలికలను వేధింపులకు గురి చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రయాణికులు ఏమైన విలువైన వస్తువులను, బ్యాగులను ఆటోల్లో మరిచిపోతే స్థానిక పోలీసు స్టేషనుకు అందజేయాలన్నారు. చాలా కేసుల్లో ఆటో డ్రైవర్లు నిందితులుగా మారుతున్నారన్నారు. ఆటో డ్రైవర్లు అసాంఘిక కార్యకలాపాలకు, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని జిల్లా ఎస్పీ హితవు పలికారు. ఆటో డ్రైవర్లుతో త్వరలో సమావేశం నిర్వహించాలని, అటోలకు ప్రత్యేకం గా సీరియల్ నంబర్లును ఇవ్వాలని, నంబర్లు చూడగానే ఆటో యజమాని, డ్రైవరు, చిరునామ వంటి వివరాలు తెలిసే విధంగా కంప్యూటరైజ్డ్ చేయాలని ట్రాఫిక్ సిఐ సిహెచ్.సూరి నాయుడుని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ సిహెచ్.సూరి నాయుడు, ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు, ట్రాఫిక్ ఎస్ఐ ఎస్.బాస్కర రావు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

4
614 views