
అనర్హత వేటు భయం.. రాజీనామా బాటలో దానం, కడియం?
తెలంగాణ స్టేట్ న్యూస్** నవంబర్ 23***(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
అనర్హత వేటు భయం.. రాజీనామా బాటలో దానం, కడియం?
*అధిష్ఠానం అనుమతి కోసం ఢిల్లీకి వెళ్లి మంతనాలు జరుపుతున్న దానం,
*దానంతో పాటు కడియం శ్రీహరి కూడా అదే బాటలో ఉన్నారంటూ ప్రచారం,
*వివరణకు మరింత గడువు కావాలని స్పీకర్‌ను కోరిన కడియం శ్రీహరి
రాజీనామా చేసి, ఉపఎన్నికలో టికెట్‌పై హామీ పొందేందుకు ప్రయత్నాలు,
*తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కీలక మలుపు తిరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి తమపై అనర్హత వేటు పడకుండా ముందే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించేందుకే దానం నాగేందర్ ఢిల్లీ వెళ్లారని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
*బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ కేటీఆర్ సహా పలువురు నేతలు స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ ఈ పిటిషన్లపై విచారణ వేగవంతం చేశారు. ఈ నెల 23లోగా వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ గురువారం దానం, కడియంలకు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు అందుకున్న రోజే దానం నాగేందర్ ఢిల్లీకి పయనం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
*లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడంతో దానం పార్టీ మారినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి. దీంతో విచారణ కొనసాగితే అనర్హత వేటు తప్పదని భావిస్తున్న ఆయన, అంతకంటే ముందే రాజీనామా చేయడమే మేలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి బదులుగా తనకు రాజ్యసభ సీటు లేదా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవాలని, లేదంటే ఖైరతాబాద్ ఉపఎన్నికలో మళ్లీ తనకే టికెట్ ఇచ్చి, గెలిచాక మంత్రి పదవి ఇవ్వాలనే పలు ప్రతిపాదనలను అధిష్ఠానం ముందు ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది.
*మరోవైపు, కడియం శ్రీహరి పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తన కుమార్తె కావ్యకు ఆయన బహిరంగంగా మద్దతు పలకడం, నామినేషన్ పత్రాలపై సంతకం చేయడం వంటివి ఆయనకు ప్రతికూలంగా మారాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం స్పీకర్‌ను కలిసిన కడియం శ్రీహరి.. వివరణ ఇచ్చేందుకు మరికొంత గడువు కావాలని కోరారు. కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే దానం రాజీనామా చేస్తారని, కడియం కూడా అదే దారిలో నడిచే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.