
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ఆగ్రహం
పేద, మధ్యతరగతి భవిష్యత్తు తో చెలగాటమా? — మాజీ ఎమ్మెల్యే డా.మొండితోక జగన్ మోహనరావు
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు, నవంబర్ 20 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)
ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీవ్రమైన అన్యాయమని మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహనరావు విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి చందర్లపాడు గ్రామంలో నిర్వహించిన “కోటి సంతకాల ప్రజా ఉద్యమం” కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమం ప్రారం భానికి ముందు గ్రామంలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రైవేటీకరణ నిర్ణయం పేదలు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో 17 వైద్య కళాశాలలను స్థాపించడం రాష్ట్రానికి చేసిన విశేష సేవ అని, అదే కారణంతో వాటిని ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
ప్రైవేటీకరణ వల్ల వైద్య విద్య పేద విద్యార్థులకు అందని ద్రాక్ష పండుగా మారుతుందని డా. జగన్‌మోహనరావు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయాన్ని పునర్విచారణ చేసి, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిం చాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.