
ఒకే వేదికపై పవన్, ఐశ్వర్య రాయ్, ప్రధాని మోడీ, సచిన్, సీబీఎన్.. కారణం ఇదే
ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తి వేదికగా సత్యసాయి శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ మేరకు ముందుగా పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్ సహా పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు.
ఆ తర్వాత సాయి కుల్వంత్ హాల్‌లో సత్యసాయి మహా సమాధిని మోడీ దర్శించుకున్నారు.ఆ తర్వాత మోడీ హిల్ వ్యూ స్టేడియానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో బాబా జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలను ప్రధాని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో పీఎం మోడీతో పాటు ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, నటి ఐశ్వర్య రాయ్ కూడా పాల్గొన్నారు. అలానే కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. కాగా ఈ నెల 23 వరకు సత్యసాయి శత జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. ప్రజల్ని జడ్జ్ చేయొద్దని సత్యసాయి చెప్పారని అన్నారు. ప్రజలను అర్థం చేసుకోవాలని.. అందువల్ల చాలా సమస్యలు తొలగిపోతాయని వెల్లడించారన్నారు. 2011 వరల్డ్‌కప్‌లో తాను ఆడినప్పుడు భావోద్వేగాలు అధికంగా ఉండేవని చెప్పుకొచ్చారు. అప్పుడు బెంగళూరులో ఉన్నామని.. సత్య సాయిబాబా ఫోన్ కాల్ చేశారని గుర్తు చేసుకున్నారు. అనంతరం ఒక పుస్తకం పంపారని.. అది తనలో సానుకూల దృక్పథాన్ని, స్ఫూర్తిని నింపిందని తెలిపారు. ఆ సంవత్సరం ట్రోఫీ కూడా గెలుచుకున్నామని.. అది తమకు గోల్డెన్ మూమెంట్'' అని సచిన్ వ్యాఖ్యానించారు.
అలానే సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సేవ, ప్రేమకు సత్య సాయిబాబా ప్రతిరూపం అని అన్నారు. 1600 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగునీరు అందించారని.. 102 విద్యాలయాలు నెలకొల్పారని కొనియాడారు. ఎన్నో వైద్యాలయాలు స్థాపించి ప్రజలకు సేవ చేశారని వివరించారు. దాదాపు 140 దేశాల్లో 200 కేంద్రాల్లో సత్యసాయి ట్రస్ట్ సేవలందిస్తోందని ప్రశంసలు కురిపించారు. ట్రస్ట్‌కు 7లక్షల మందికి పైగా వాలంటీర్లు ఉన్నారని.. ప్రభుత్వాల కంటే వేగంగా సత్యసాయి స్పందించేవారని చెప్పుకొచ్చారు.