logo

ఆంధ్రప్రదేశ్ సెలవు నిబంధనలు A.P Leave Rules

ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం 1933లో ఆమోదించిన సెలవు నిబంధనలే కొన్ని సవరణతో "ఆంధ్రప్రదేశ్ సెలవు" నిబంధనలు - 1933" అను పేరుతో ఈనాటికీ అమలులో ఉన్నవి.
ఆంధ్రప్రదేశ్ ఫండమెంటల్ రూల్పు యొక్క అనెగ్జర్- III నందు ఆంధ్రప్రదేశ్ సెలవు నిబంధనలు- 1933 చేర్చబడియున్నవి. ఈ సెలవు నిబంధనలు ప్రభుత్వ ఉద్యోగులతోపాటు అన్ని యాజమాన్యములలోని ఉపాధ్యాయులకు వర్తించును. ఇందులో సంపాదిత సెలవు, అర్థజీతపు సెలవు, జీతనష్టపు సెలవు అను మూడు రకములున్నవి. యఫ్.ఆర్. అనెగ్జర్-VII నందు క్యాజువల్ సెలవులకు సంబంధించిన నిబంధనలు చేర్చబడియున్నవి. ఉద్యోగి అర్హత కలిగి వున్నప్పుడు అతడు కోరిన సెలవును మాత్రమే మంజూరు చేయాలి.

*1.ఆకస్మిక(సాధారణ) సెలవు Casual Leave :*
*(ఎ)* ప్రతి ఉద్యోగి సం॥మునకు 15 రోజుల చొప్పున సాధారణ సెలవును జనవరి నుండి డిసెంబరు వరకు క్యాలెండర్ సం॥లో వాడుకోవాలి. (G.O.Ms. No. 52, dt: 4-2-1981) ఆదివారములు, నెలవు దీనములతో కలిపి కూడా వాడుకోవచ్చు. అయితే వరుసగా మొత్తం 10 రోజులకు మించరాదు. మంజూరి అధికారి పూర్వానుమతి పొందాలి (G.O.Ms.No. 112 Fin Dt. 3-6-1966).తాత్కాలిక ఉద్యోగులకు వారి సర్వీసును బట్టి దామాషా పద్ధతిలో సెలవును మంజరు చేస్తారు. సాధారణ సెలవును సెలవు నియమాలలోని సెలవుతోగాని, జాయినింగ్ కాలముతో గాని, వెకేషన్తోగాని జతపరచరాదు. 1/2 రోజు సెలవు కూడా మంజూరు చేయవచ్చును. కాని ఒంటిపూట బడి విషయంలో 1/2 రోజు సెలవు పెట్టరాదు. ఈ సెలవు సౌకర్యం అప్రెంటీస్ టీచర్లకు కూడా వర్తించును(GO.Ms.NO.134, dt: 10-6-1996).

*(బి)* GO.Ms.No.374 విద్యా, తేదీ: 16.3.1996 ప్రకారం మహిళా ఉపాధ్యాయులకు 5 అదనపు ఆకస్మిక సెలవులు లభించును. ఈ సౌకర్యం జీవో.నెం. 3 ఎఫ్ & పి తేది: 5. 1.2011 ద్వారా మహిళ జూనియర్ లెక్చరర్లకు కల్పించబడినది.
మరియు G.O.MS.No. 18
తేదీ: 10-03-2021 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో పనిచేస్తున్న అన్ని మహిళా ఉద్యోగులకు క్యాలెండర్ సంవత్సరంలో ఐదు (5) రోజుల అదనంగా క్యాజువల్ లీవ్ కల్పించబడినది.

*2.ప్రత్యేక ఆకస్మిక(సాధారణ) సెలవు Special Casual Leave :* క్యాలెండర్ సం.లలో 7 రోజులకు మించకుండా ప్రత్యేక సాధారణ సెలవు వాడుకోవచ్చు. సాధారణ సెలవు నిల్వ ఉన్నప్పటికీ Spl. CL వాడుకోవచ్చు. Spl. CL ను ఇతర సాధారణ సెలవు దినాలతో కల్పి 10 రోజులు మించకుండా వాడుకోవాలి. 1/2 రోజుకూడా మంజూరు చేయవచ్చు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పాల్గొన్న సందర్భంలో 7 రోజులతో కలిపి 30 రోజులు వాడుకోవచ్చు (GO.Ms.No.47, Fin, dt : 19-2-1965). రక్తదానం చేసిన ఉద్యోగికి ఒక రోజు Spl. CL అదనంగా ఇవ్వబడును (GO.Ms.No.137 M & H dt: 23-2-1984).

*3.ఆప్షనల్ సెలవులు Optional Holiday :* ప్రతి ఉద్యోగి ప్రభుత్వం నిర్ణయించిన ఆప్షనల్ సెలవుల లిస్టు నుంచి ఒక క్యాలెండర్ సం.లో 5 రోజులు వాడుకోవచ్చును. (G.O.Ms.No.52, dt : 4-2-1981) ఈ సదుపాయం అన్ని మేనేజ్మెంట్లలోని ఉపాధ్యాయులకు కూడా GO.Ms.No.1205 Edn. dt: 23-11-81 ద్వారా వర్తింపచేయబడినది. ఈ సెలవును ఏ మతం వారైనా వాడుకోవచ్చు.

*4.కుటుంబ నియంత్రణ ప్రత్యేక క్యాజువల్ లీవు:* కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకున్న మహిళా ఉద్యోగికి (14) రోజులు, పురుషా ఉద్యోగికి (6) రోజులు ప్రత్యేక CL ఇస్తారు . (GO.Ms.No. 1415 M & H, dt: 10-6-1968) కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స భార్య చేయించుకున్నచో ఆమెకు సహాయం చేయుటకు భర్తకు (7) స్పెషల్ సి.ఎల్.ఇస్తారు. (G.O.Ms.No. 802, M & H, dt : 21-4-1972) మొదట శస్త్ర చికిత్స విఫలమైనప్పుడు రెండవసారి శస్త్రచికిత్స కొరకు మహిళా ఉద్యోగికి 14 రోజులు (GO.Ms.No.124 F & P dt: 13-4-1982).పురుష ఉద్యోగికి 6 రోజులు GO.Ms.No.257 F & P, dt: 5-1-1981 మంజూరు చేస్తారు. గర్భ నిరోధక సాధనం (లూప్ ) అమర్చుకున్న రోజు స్పెషల్ CL మంజూరు చేస్తారు (GO.Ms. No. 128 F & P Dt:13-4-1982) ఇద్దరి కంటే తక్కువ పిల్లలు ఉన్నప్పుడు లేక ఆపరేషన్ తర్వాత మగ, ఆడ పిల్లలు అందరూ చనిపోయినప్పుడు రీకానలైజేషన్ శాస్త్ర చికిత్స చేయించుకొను మహిళా ఉద్యోగికి 21 రోజులు లేదా అవసరమైన రోజులు ఏది తక్కువ అయితే ఆ మేరకు మంజూరు చేస్తారు (G.O.Ms.No. 102 M & H, dt. 19-2-1981). మహిళా ఉద్యోగి హిస్టరెక్టమి (గర్భసంచి తొలగింపు) శస్త్ర చికిత్స చేయించుకున్నప్పుడు సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఫారసు మేరకు 45 రోజుల ప్రత్యేక సెలవు ఇవ్వబడును (G.O.Ms.No.52, Fin. dt: 1-4-2011).

*5.పరిహార సెలవు (C.C.L.) :* ప్రభుత్వ సెలవు దినాలలో పనిచేసిన ఉద్యోగి ఈ సెలవునకు అర్హుడు. ఈ సెలవు ఒకేసారి 7 రోజులకు మించి నిల్వయుండును. సం.లో 10 రోజులకు మించి వాడుకోరాదు. ఈ సెలవును పనిచేసిన దినము నుండి 6 నెలలోపుగాని, యాజమాన్యము అనుమతించినప్పటి నుండి 6 నెలలలోపుగాని వాడుకోవాలి. (ప్రభుత్వ మెమో నెం. 13112/58 ఫ్ & పి, తేది 1-3-1958).

*6.సంపాదిత సెలవు Earned Leave :* నాన్వెకేషన్ డిపార్టుమెంటులో పనిచేసే శాశ్వత ఉద్యోగి ప్రతి జనవరి 1మరియు జూలై 1న 15రోజుల చొప్పున వారి సెలవు ఖాతాకు జమ చేయబడుతుంది. వెకేషనల్ డిపార్ట్మెంట్ వారికి డ్యూటీ కాలము ×1/11-30 / 365 అను సూత్రము ప్రకారం లెక్కిస్తారు. 1.11.89 నుండి ఈ సెలవు వెకేషన్ డిపార్టుమెంట్ వారికి సం.నకు 5 రోజులకు పెంచారు. (జీవో నెం. 354, విద్య, తేది 20.11.89 ప్రకారం) డ్యూటీ కాలవ 5 ×(1/11×28/365) సూత్రము ప్రకారము సంపాదిత సెలవు 5 రోజులుగా లెక్కిస్తారు. (GO.Ms. No. 317, Edn. dt : 15-9-94) డ్యూటీ కాలం × 1/11 - 27/365 అను సూత్రం ప్రకారం సంపాదిత సెలవు 6 రోజులు జమచేస్తారు. ప్రతి జనవరి 1న మరియు జూలై 1న ఉద్యోగి ఖాతాకు 3 రోజుల చొప్పున అడ్వాన్సుగా జమ చేయవచ్చు. రెగ్యులర్ కానీ తాత్కాలిక ఉద్యోగులకు సగం రోజులకు మాత్రమే అర్హత కలిగి ఉంటారు . ఈ సెలవు 300 రోజులకు మించి నిల్వ ఉండదు. రిటైరైనప్పుడు 300 రోజులకు మించకుండా నగదు చెల్లిస్తారు . GO.Ms.No.232 F & P, dt: 16-9-05.

*Surrender of Earned Leave సరెండర్ సెలవు*
మిగిలివున్న (EL) ఆర్జిత సెలవును ఎన్ క్యాష్ చేసుకొనుటకు అవకాశము కల్పించబడినది. (G.O.Ms. No. 418. 2 18-4-1979). ప్రతి ఆర్థిక సంవత్సరంలో 15 రోజులకు మించకుండా లేదా రెండు ఆర్ధిక సంవత్సరములకు ఒక పర్యాయపు 30 రోజుల ఆర్జిత/రిజర్వు సెలవును సరెండర్ చేసి పూర్తి వేతనము పొందవచ్చును.ఒకసారి ఈ సెలవులు వాడుకున్న తరువాత తిరిగి సరెండర్ చేయాలంటే ఒక సంవత్సరం గ్యాప్ తరువాత వాడుకొనవచ్చును. ఫలానా క్యాటగిరి వారు ఫలానా నెలలోనే వాడుకోవాలన్న నిబంధన తొలగించబడినది (Govt. Memo No. 14781-C/278/FR.I/2011 Dt. 22-6-2011). 30వ జూన్ నాటికి 286 రోజుల కన్నా ఎక్కువ EL నిలువ ఉన్న ఉద్యోగులు 12 నెలలు వరకు వేచి ఉండ కుండా సెలవులను సరెండర్ ఎప్పుడైనా చేసుకోవచ్చును. ఇవి శాశ్వత ఉత్తర్వులు, (First Debit, Next Credit). ఒకటి జనవరి లేదా ఒకటి జులై నాదు సరెండర్ చేయు ఉద్యోగుల వారి ఖాతాలోనున్న ELల నుండి సరెండర్ చేసి పిదప అనాడు జమచేయబడు సెలవులను ఖాతాలో కలుపుకొనవచ్చును.
వేసవి సెలవుల్లో పనిచేసిన కాలమునకు సెలవు ప్రిజర్వు FR 82 ప్రకారం చేసిన చేసినచో అట్టి రిజర్వు సెలవులను సరెండర్ చేయవచ్చు లేదా ఎన్క్యాష్మాంట్ చేసుకోవచ్చు. 2000 సంవత్సరం నుండి వేసవి నుండి ఇప్పటివరకు SSC పరీక్షలలో పనిచేసినందుకు FR 82 ప్రకారం రిజర్వు చేయబడును.

*7.సగము వేతనము సెలవు (Half Pay Leave)*

ఈ సెలవు ప్రతి ఉద్యోగి పూర్తి సంవత్సరము సేవలకు 20 రోజుల చొప్పున లభించును. ఆరు నెలల సర్వీసుకు 10 రోజుల చొప్పున లెక్కించరాదు. అనగా సంవత్సరమునకు ఎన్ని రోజులు తక్కువ ఉన్నను ఈ సెలువు రారు.. సంపాదిత సెలవు వలె క్యాలెండర్ ఇయర్కు 20 లెక్క కట్టరాదు. ప్రతి సర్వీసు సంవత్సరమునకు 20 రోజులు వచ్చును. జీత నష్టపు కాలమునకు కూడా HPL ఇవ్వబడును.ఈ సెలవు అప్రెంటీస్ టీచర్లకు కూడా లభించును. కానీ ఒక సం॥పు అప్రెంటీస్ కాలము పూర్తయిన తరువ . (C&DSE Proc. No. 4006/C3-4/2002 dt. 18-12-2002 & GO.MS No. 40, dt. 11-5-2006).ఈ సెలవును అనారోగ్య కారణాలు లేదా వ్యక్తిగత/ప్రైవేట్ కారణాల కొరకు వాడుకొనవచ్చును. అనారోగ్య కారణాలతో అయితే మెడికల్ సర్టిఫికెట్ జత చేయాలి. ఇతర కారణాలతో అయితే మెడికల్ సర్టిఫికెట్ అవసరం లేదు. అర్ధవేతనము సెలవు వాడుకొన్నచో సగము మూలవేతనము, సగము మూలవేతనముపై వచ్చు డి.ఏ. మరియు 180 రోజుల వరకు పూర్తి HRA, CCA లభించును. ఆ తర్వాత HRA, CCA రాదు (G.O.Ms. No. 28 dt. 9-3-2011). అనారోగ్య కారణాలచే వైద్య ధృవపత్రము ఆధారముగా కమ్యూట్ చేసినచో మొత్తము వేతనము పొందవచ్చును కాని రెట్టింపు అర్ధవేతనము సెలవులు కోల్పోవలసి వచ్చును. మొత్తం సర్వీసు కాలంలో 480 రోజులు HPL కమ్యూట్ చేసి 240 రోజుల పూర్తి వేతనం పొందవచ్చును G.O.Ms.No. 186 F&P Dt. 23-7-75). మిగిలిన రోజులకు HPL ఇవ్వబడును. అర్ధవేతనము సెలవు కాలాన్ని రెగ్యులర్ సర్వీస్ గా లెక్కిస్తారు. ఇంక్రిమెంట్ కు, అప్రెంటీస్ కాలమునకు సీనియారిటీకి అంతరాయం ఉండదు. పదవీ విరమణ నాటికి / లేదా చనిపోయిన నాటికి నిలువ వున్న అర్ధవేతనము సెలవులను ఎనాక్యాష్ చేసుకొనవచ్చును. కానీ ఆర్జిత సెలవులు & అర్థవేతన సెలవులు కలిపి 300 రోజులకు మించకూడదు. (G.O. Ms No. 154 Dt 4-5- 2010). ఈ సౌకర్యము మున్సిపల్ టీచర్లకు కూడా (DSE Memo No. 2062/L2-11 dt. 24-12-2011) ప్రకారం వర్తించును. PR ఉపాధ్యాయులకు కూడా వర్తించేవిధంగా 10వ PRC సిఫారు చేసినది. G.O.Ms. No. 90. ఆర్థిక తేదీ 8-6-2018 ద్వారా పంచాయతీరాజ్, మున్సిపల్, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు తేది. 4-5-2010 నుండి వర్తించే విధంగా అర్ధవేతన సెలవును నగదుగా మార్చుకునే సౌకర్యం కల్పించింది.

*8.అసాధారణ సెలవు Extra Ordinary Leave (E.O.L)*
ఏ రకము సెలవులు లేనపుడు లేదా సెలవులు ఉన్నప్పటికీ ఉద్యోగి వ్రాతపూర్వకముగా కోరిన సందర్భములో వేతనము లేని సెలవు EOLవాడుకొనవచ్చును.
ఈ సెలవుకాలంతో సమాన రోజులు వార్షిక ఇంక్రిమెంటు ముందుకు జరుగును. కానీ వైద్య కారణాలతో వైద్య ధృవపత్రం ఆధారంగా) ఈ సెలవు మంజూరి అయినచో 6 నెలల వరకు ఇంక్రిమెంటుకు లెక్కించబడును. కానీ డిపార్ట్ మెంట్ అధికారి గారి అనుమతి పొందాలి. 6 నెలలకు మించిన కాలమును ప్రభుత్వము అనుమతి పొందాలి. అనుమతి పొందిన తరువాతనే ఇంక్రిమెంటుకు పరిగణించి లెక్కించబడును.
వైద్య కారణాల వలన ఈ సెలవు మంజూరు అయితే సర్వీసులో 3 సం॥ల కాలము వరకు పెన్షన్కు లెక్కించబడును.
అప్రెంటీస్ ఉపాధ్యాయులు ఉన్నత విద్యార్హతలకై వేతనము లేని సెలవు కోరితే DEO గారు మంజూరు . (C&DSE Proc. Rc. No. SPL/VE-1/2003 Dt. 16-8-03).
5 సం||ల సర్వీసు గల ప్రభుత్వోద్యోగులు ప్రభుత్వ అనుమతితో విదేశాలలో ఉద్యోగం చేయుటకు 5 సం॥లు వేతనము లేని సెలవు వాడుకొనవచ్చును G.O.Ms.No.214 (F&P) Dt.3-9-1996. ఈ కాలము రెండు లేదా మూడు లేదా అంతకన్నా ఎక్కువ దఫాలుగా వాడుకొనవచ్చును.
సంబంధిత అధికారి నుండి అనుమతి లేకుండా ఒక సంవత్సరం వరకు డ్యూటీకి అనుపస్థితులైన ఉద్యోగిని సర్వీసు నుండి తొలగించవచ్చును G.O.Ms.No. 11 dt. 13-1-04.
గుండె, కిడ్నీ, క్యాన్సర్, న్యూరో వాధ్యులతో బాధపడుతూ EOLలో ఉన్న ఉద్యోగులకు 'ఎక్స్ గ్రేషియా' ఇవ్వబడును.

*9.ప్రసూతి సెలవు Maternity Leave*

G.O.Ms.No. 152 Fin (FRI) Dept dt 4-5-2010 ప్రకారం వివాహిత మహిళా ఉద్యోగులకు, టీచర్లకు 180 రోజుల ప్రసూతి సెలవు లభించును. ఈ సదుపాయము అప్రెంటీస్ ఉపాధ్యాయినులకు కూడా లభించును. ఈ సెలవు ఇద్దరు జీవించి ఉన్న పిల్లల వరకే పరిమితము అనగా ఇప్పటికే ఇద్దరు సంతానమున్నచో 3వ కాన్పుకు మెటర్నిటీ సెలవు రాదు. అబార్షన్కు, మిస్క్యారేజి సందర్భమున 6 వారాల మెటర్నిటీ సెలవుకు అర్హత కలదు. (G.O.Ms.No. 254 Dt. 10-11-1995) పదోన్నతి లభిస్తే ప్రసూతి సెలవులు పూర్తి అయిన తర్వాతనే పదోన్నతి పోస్టులో చేరవచ్చును. ప్రసూతి సెలవులో ఉండగా బదిలీ జరిగితే ప్రసూతి సెలవులు పూర్తి అయిన తరువాత విధులలో చేరవచ్చును. (C&DSE Proc.Rc.No.29/C3-4/2003 Dt. 25-01-2003) . ప్రసూతి సెలవులు ముగిసి విధులలో చేరిన తర్వాతనే వార్షిక ఇంక్రిమెంట్ యొక్క ఆర్థిక లాభము ఇవ్వాలి (G.O.Ms.No. 853 FR-II Date 22-01-2013).

ప్రసూతి సెలవులో నుండగా వేసవి సెలవులు లేదా ఇతర సెలవులు వచ్చిన సందర్భంలో అట్టి సెలవులను కలుపుకొని ప్రసూతి సెలవులనున 180 రోజులుగా పరిగణించబడును. దసరా, సంక్రాంతి, వేసవి సెలవులలో ప్రసవించిన సందర్భంలో ప్రసవించిన తేదీ నుండి 180 రోజులు సెలవులు మంజూరు చేస్తారు. (ప్ర. ఉ. 483, విద్య-తేది. 4-5-1979) ప్రసూతి సెలవును వైద్యులు సూచించిన మేరకు కాన్పుకు ముందు నుంచే సెలవును దరఖాస్తు చేసుకొనవచ్చును. అయితే ప్రసూతి ధృవపత్రము ఆధారముగానే ఈ సెలవు మంజూరు చేయబడును. (ప్ర.ఉ. 384, ఆర్థిక తేది. L5-11-1977) ప్రకారము ప్రసూత సెలవును from the date of continement of leave నుండి మంజూరు చేయబడును. డెలివరీలో బిడ్డ మరణించిననూ ప్రసూతి సెలవు 180 రోజులు వాడుకొనవచ్చును. ప్రసూతి సెలవుకు ముందు లేక వెనుక (ప్రిఫిక్స్ లేక సఫిక్స్) ప్రభుత్వ సెలవులు వాడకొనుటకు అనుమతించబడదు. ప్ర.ఉ. 84. తేది. 17-9-2012 ప్రకారం ప్రసూతి సెలవును 180 మంజూరు చేయు అధికారము ప్రధానోపాధ్యాయుకు, మండల విద్యాధికారులకు రీ-డెలిగేట్ చేయబడినది. మెటర్నిటీ సెలవు ప్రొబేషన్ కాలానికి వర్తింపజేస్తూ సాధారణ పరిపాలన శాఖ (జిఏడి) G.O.Ms. No. 35, dt: 16-03-2024.

*10.పితృత్వ సెలవులు Paternity Leave*

ప్రభుత్వ ఉద్యోగి భార్య ప్రసూతి అయినచో ఆ ఉద్యోగి (15) రోజుల పితృత్వ సెలవులు వాడుకొనుటకు ప్రభుత్వము ఉత్తర్వు సంఖ్య. 231 తేది. 18-9-2006 ద్వారా అనుమతించినది. ఈ సెలవులు ఇద్దరు జీవించి ఉన్న పిల్లల వరకు పరిమితము. అనగా ఇద్దరు పిల్లలు జీవించి ఉన్నలో మూడవ కాన్పు సందర్భంలో ఈ సెలవులు రావు. ఈ రకమైన సెలవులు తేది. 16-9-2006 నుండి అమల్లోకి వచ్చినవి, తన భార్య ప్రసూతి అయినట్లు వైద్య రాపపత్రము సమర్పించినచో ముండల పరిధి ఉపాధ్యాయులకు మండల విద్యాధికారి, ఉన్నత పాఠశాలల ఉపాధ్యా యులకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఉప విద్యాధికారి గారు మంజూరు చేస్తారు. భార్య ప్రసూతి అయిన తేదీ నుండి 6 నెలల లోపు ఎప్పుడైనా వాడుకొనవచ్చును (Memo No.20129-C/454/FR/ 10 dt. 27-7-2010) పిల్లలను దత్తత తీసుకున్న ఒంటరి పురుష ఉద్యోగికి 15 రోజుల పితృత్వ సెలవు (GO.Ms. No. 33, dt. 8-3-2022)

*11.మహిళా ఉద్యోగినులకు ' చైల్డ్ కేర్ లీవ్ Childcare Leave*

ఆం.ప్ర. రాష్ట్ర ప్రభుత్వము మహిళా ఉద్యోగినులు, ఉపాధ్యాయినులకు 60 రోజుల పిల్లల సంరక్షణ సెలవు వాడుకొనుటకు G.O.Ms. No. 132 ఆర్థిక తేది. 6-7-2016 ద్వారా కొన్ని షరతులకు లోబడి అనుమతించినది. ఈ సెలవులు 18 సం॥ల వయస్సు లోపు (వికలాంగులైతే 22 సం॥లు) ఆధారపడిన పిల్లల సంరక్షణ కొరకు 3 కంటే తక్కువ కాని విడతలలో వాడుకొనవచ్చును. పెంపకంలో శ్రద్ధ తీసుకొనుటకు (Taking care of the minor child for rearing) పరీక్షలు మరియు అనారోగ్యంగా ఉన్నప్పుడు పిల్లల సంరక్షణ కొరకు మాత్రమే ఈ సెలవులు వాడుకొనవలెను. దరఖాస్తులో ఈ కారణములు చూపాలి. ఈ సెలవుపై ఉన్నప్పుడు LTC వాడుకొనరాదు. ఈ సెలవు ఖాతాకు ప్రత్యేకంగా సేవపుస్తకంలో నిర్వహించాలి (Period of Child care leave-Balance of child care leave-signature and designation of certifying officer) ఈ సెలవును సంపాదిత సెలవు, అర్ధవేతన సెలవు ఖాతా నుండి తగ్గించరాదు. కార్యాలయపు అధికారి సదరు మహిళా ఉపాధ్యాయినికి ఈ సెలవు వాడుకొనుట వలన కార్యాలయపు పనితీరుపై ఏ విధమైన ప్రభావము చూపదని నిర్ధారించుకొని దీనికి అవసరమైన ఉత్తర్వులలో కారణాలు చూపుతూ ఇవ్వాలి. ఈ సెలవును ఒక హక్కుగా డిమాండ్ చేయరాదు. దీనికి మంజూరు అధికారి ముందస్తు అనుమతి అవసరము. ఈ సెలవును ప్రసూతి సెలవు లేక క్యాజువల్, స్పెషల్ క్యాజువల్ సెలవు కాని ఏ ఇతర సెలవులతో కలిపి కొనసాగింపుగా వాడుకొనవచ్చును. ప్రొబేషన్ కాలములో కూడా ఈ సెలవును వాడుకొనవచ్చును. అయితే ఆ మేరకు ప్రొబేషన్ కాలము పొడిగించబడును. leave not due గా కూడా ఈ సెలవును అనుమతించబడును. ఎంతమంది పిల్లలు ఉన్ననూ మొదటి ఇద్దరు వయసులో పెద్ద పిల్లల వయస్సు 18 సం॥ల వరకు, సర్వీసులో మొత్తము 60 రోజులు వరకు వాడుకొనవచ్చును. ఈ సెలవు పెట్టుకొనుటకు ఎటువంటి ధృవపత్రములను సంబంధిత ఉత్తర్వులలో సూచించలేదు. మహిళా ఉద్యోగిని, ఉపాధ్యాయిని ఇచ్చే సేవా పుస్తకములో నమోదు చేసుకొన్న కుటుంబ సభ్యులు, వారి పుట్టిన తేదీలు ఆధారంగా ఈ సెలవులు మంజూరు చేస్తారు. ఈ సెలవును అన్నిరకాల మేనేజ్మెంట్లోని బోధన, బోధనేతర సిబ్బంది వాడుకొనవచ్చును పాఠశాల విద్యా సంచాలకులు ఈ ఉత్తర్వులు అమలుకు జిల్లా విద్యాశాఖధికారులను సూచనలు అందించినారు (Rc. No. 445/Estt.V-1/2016, Dt. 25-7-2016).

*RPS 2022లో ఈ సెలవు 180 రోజులకు పెంచుతూ గరిష్టంగా 10 విడతలుగా వాడుకోనటుకు అనుమతించనైనది (GO. Ms. No. 199 Fin Dept. 19-10-2022)*.

*ఈ సెలవులు మహిళా ఉద్యోగినులు/టీచర్లు మైనర్ బిడ్డల సంరక్షణ నిమిత్తం రిటైర్ అయ్యేలోపు వాడుకొనవచ్చునని G.O.Ms. No.36, తేది. 16-03-2024 ద్వారా ఆదేశాలు ఇవ్వబడ్డాయి.*

*12.ప్రత్యేక సెలవులు*

ఆంధ్రప్రదేశ్ సెలవు నిబంధనలు 1933 రూల్ 28(బి), 29(బి) ప్రకారం దీర్ఘకాలిక వ్యాధులైన కుష్టు, (లిప్రసీ) క్షయ (టి.బి), క్యాన్సర్, మెంటల్ డిజాస్టెర్, కిడ్నీమార్చిడి, డయాలసిస్, గుండె జబ్బులు గల రోగులకు వారి నిల్వలో గల అర్థ వేతనము సెలవు నుండి ఈ సెలవు మంజూరు చేస్తారు G.O.Ms. No. 188 Fin (FR-I&L) Dept. 30-7-1973. (orders issued in the GO cited provide for the drawal of full pay to the extent of six months half pay leave at credit by all regular Govt. Servants suffering from Leproscy/Tuberculosis/Can-cer and Mutual illness irrespective of their pay limit)

GO.Ms. No. 449 Fin & Ply (FRI) Dept. dt. 28-10-1976 ద్వారా గుండె జబ్బులు ఉన్న వారికి వైద్య ధృవపత్రము మేరకు 6 నెలల వరకు పూర్తి వేతనముతో ప్రత్యేక సెలవు లభించు సౌకర్యము కల్పించబడినది..

GO.Ms. No. 268 F&P (FWFR-I) Dept. dt. 28-10-1991 ప్రకారం కిడ్నీ మార్పిడి జరిగిన ఉద్యోగి కూడా పై సెలవు లభించును
(ఉస్మానియా జనరల్ హాస్పిటల్ హైదరాబాద్ చూపరీడెన్ ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్ పరిగణించబడును). 6వ నెల తర్వాత కూడా అర్థవేతనము సెలవు వాడుకున్నచో 8 వ నెల చివరి వరకు HPL HRA & CA పూర్తిగా ఇస్తారు GO.Ms.No. 29, dt. 9-3-2011.

G.O.Ms. No. 33, Fin. dt. 8-3-2022. 11వ పి.ఆర్.సి సిఫార్సు లకనూగుణంగా ఈ క్రింది వారికి ప్రత్యేక సెలవు ఇవ్వబడినవి.

*ఎ* . బోధనేతర మహిళా ఉద్యోగిసులకు కూడా క్యాలండర్ సంవత్సరమునకు '5' అదనపు సెలవులు టీచర్లతో పాటు ఇవ్వబడినవి.

*బి* .ఇద్దరి కన్నా తక్కువ పిల్లలు కలిగి ఉన్న మహిళా ఉద్యోగి, ఒక సంవత్సరం వరకు వయస్సు ఉన్న 'బిడ్డను చట్టపరంగా దత్తత తీసుకుంటే వారికి 180 రోజుల చైల్డ్ అడాప్షన్ లీవ్ (Child Adaption Leave) ఇవ్వబడును. ఇదే ఒంటరి పురుష ఉద్యోగి పైవిధంగా దత్తత తీసుకుంటే 15 రోజుల పితృత్వ సెలవు ఇవ్వబడును.

*సి* . ఆర్థోపెడిక్ అంగవైకల్యము కలిగి ఉంది ఏదైనా కృత్రిమ పరికరము (Prosthetic Aids) ఉపయోగించుచున్న ఉద్యోగులకు వాటిని మార్చుకొను అవసరముంటే వారికి సంవత్సరానికి 7' అదనపు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వబడును. ఇదే విధంగా హైరిస్క్ ఉన్న వార్డులలో పనిచేసే నర్సులకు కూడా "7" అదనపు స్పెషల్ క్యాజువల్ లీవ్లు ఇవ్వబడినవి.

0
0 views