logo

వికటించిన ఐవీఎఫ్

కట్టుకున్న భార్య, త్వరలో బయటకు రావాల్సిన కవల పిల్లలు ఇద్దరు ఇక లేరన్న వార్తను భర్త తట్టుకోలేకపోయాడు. దీంతో ఆత్మహత్య చేసుకున్న విషాదకరమైన ఘటన శంషాబాద్‌లో చోటుచేసుకుంది. ఆర్జీఐఏ ఇన్‌స్పెక్టర్‌ కె.బాల్‌రాజ్‌ తెలిపిన వివరాల ప్రకారం...బెంగళూరుకు చెందిన ముత్యాల విజయ్ (40), అతని భార్య శ్రావ్య (35) ఏడాదిన్నర కిందట శంషాబాద్‌కు వచ్చారు. విజయ్ ఎయిర్‌పోర్టులో జాబ్ చేస్తున్నాడు. వారి ప్రేమ ఫలించి, కడుపు పండింది. ఐవీఎఫ్‌ చికిత్సతో శ్రావ్య గర్భం దాల్చడం, అందులోనూ కవలలు పెరుగుతున్నారని తెలియడం ఆ దంపతులకు జీవితంలో మరువలేని సంతోషాన్ని ఇచ్చింది. అల్లరి చేసే తమ కవలల కోసం వేసిన ప్రణాళికలు, కన్న కలలు అన్నీ శ్రావ్య కడుపుతో పాటు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఎనిమిది నెలలు. ఆ దంపతుల ఆనందం ఆకాశాన్ని తాకింది. ప్రస్తుతం ఆమె ఎనిమిది నెలల గర్భిణి.

శ్రావ్యకు కడుపులో నొప్పి
అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. 2025 నవంబర్16న రాత్రి, శ్రావ్యకు కడుపులో నొప్పి మొదలైంది. వెంటనే ఆమెను అత్తాపూర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వారికి ఎదురైన నిజం ఆ దంపతులకు పెద్ద పిడుగుపాటు.! కవలలు గర్భంలోనే మృతి చెందారు. ఆ షాక్ తట్టుకోలేక శ్రావ్య స్పృహ కోల్పోయింది. మెరుగైన వైద్యం కోసం ఆమెను గుడిమల్కాపూర్‌లోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ.. నిండు జీవితం ఆరంభించాల్సిన ఆ తల్లి కూడా లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఆసుపత్రి నుండి శవం రూపంలో వచ్చిన భార్య, కలలు మాత్రమే మిగిల్చిన కవలలు... ఈ తీరని బాధను ముత్యాల విజయ్ తట్టుకోలేకపోయారు. తన జీవితాన్ని ప్రేమించిన తన భార్య లేకుండా, తన కలల కవలలు లేకుండా ముందుకు సాగడం ఆయనకు అసాధ్యమనిపించింది.

సోమవారం తెల్లవారుజామున శంషాబాద్‌లోని తమ ఇంట్లోనే ఉరేసుకుని ఆ భర్త కూడా తనువు చాలించారు. కొన్ని రోజులు, కొన్ని గంటల తేడాతో... ఆనందాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్న నాలుగు ప్రాణాలు అకస్మాత్తుగా ఆగిపోయాయి. నిన్నటి వరకు ఆనందంతో ఉండిన ఆ ఇల్లు నేడు శోకసంద్రమైంది. ఈ విషాద ఘటన వారి కుటుంబాన్ని, బంధువులను తీవ్రంగా కలిచివేసింది.

0
0 views