logo

వందేమాతరం స్పూర్తితో దేశాభివృద్ధి కోసం పని చేయాలి.150 వసంతాల ఉత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు #AIMA Suvarnaganti RaghavaRao

వందేమాతరం స్పూర్తితో దేశాభివృద్ధి కోసం పని చేయాలి.150 వసంతాల ఉత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు


దేశాన్ని ప్రమోట్ చేసేలా ప్రధాని మోదీ ఆలోచనలు

*నాలుగు దశల్లో ఏడాది పాటు వందేమాతరం 150 వసంతాల వేడుకలు

*వందేమాతరం 150 వసంతాల ఉత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి

*ప్రజలతో కలిసి వందేమాతర గేయాన్ని ఆలపించిన సీఎం చంద్రబాబు

వందేమాతరం స్పూర్తితో దేశాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సోమవారం తుమ్మలపల్లి కళా క్షేత్రంలో సాంస్కృతిక శాఖ నిర్వహించిన వందేమాతరం 150 వసంతాల వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను తిలకించారు. ప్రజలతో కలిసి వందేమాతరం గేయాన్ని ముఖ్యమంత్రి ఆలపించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...”వందేమాతరం నినాదంతో స్వాతంత్ర్యోద్యమం చేపట్టారు.. అందర్నీ ఏకతాటి మీదకు తెచ్చిన గేయం వందేమాతరం. బెంగాల్లోని కంఠలపారా అనే గ్రామంలో ఈ వందేమాతర గేయం పుట్టింది. బంకిమ్ చంద్ర ఛటర్జీ ఈ గేయాన్ని రూపొందించారు. మాతృభూమిని దేవతలా భావించి ‘వందే మాతరం’ పాట రాశారు. అది జాతీయ భావానికి తొలి జ్యోతి అయ్యింది. తన రచన ‘ఆనందమఠం’ నవల ద్వారా దీనిని ప్రజల్లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత కాలంలో వందేమాతరం గేయం స్వాంతంత్ర్యోద్యమ సంగ్రామంలో జాతీయ భావాన్ని రగిలించింది. వందేమాతరం ఉద్యమ గేయంగా మారింది... ప్రజలందర్నీ ఏకం చేసింది. 1950 జనవరి 24న వందేమాతరానికి జాతీయ గేయం హోదా ఇచ్చారు. ఏడాది పాటు వందేమాతరం ఉత్సవాలు జరపాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నాలుగు దశలుగా ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ప్రతి భారతీయుడు అనునిత్యం ఈ గేయాన్ని నెమరువేసుకోవాలి. లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, భగత్ సింగ్ వంటి వారికి ఈ గేయం స్పూర్తినిచ్చింది. వందేమాతరం గీతానికి బ్రిటీష్ వాళ్లు భయపడ్డారు... నిషేధించారు. అయినా ప్రజలు వెనుకడగు వేయలేదు. లాఠీఛార్జీలు, అరెస్టులు,తూటాలను ఎదుర్కొంటూ ‘వందే మాతరం’ అంటూ నినదిస్తూ వీధులలోకి వచ్చారు. ఉప్పెనలా ఉద్యమం సాగింది. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా దేశం కోసం ఆ నినాదాన్ని వీడలేదు. చనిపోయేటప్పుడు కూడా వందేమాతరం అని నినదిస్తూ ప్రాణాలు వదిలారు. 1907లో బిపిన్ చంద్రపాల్ తెలుగు నేలపైనా వందేమాతర నినాదాన్ని వినిపించారు. ఈ విశిష్ట గేయానికి 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా వేడకలు జరుపుకుంటున్నాం. ఏడాది పాటు వందేమాతరం ఉత్సవాలు జరపాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఈ వేడుకలు 2025 నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకు ఏడాది పాటు జరుగుతాయి. మొత్తం నాలుగు దశలుగా ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. మొదటి దశ నవంబర్ 7 నుంచి 14 వరకు ప్రారంభ వారోత్సవంగా జరుపుతున్నాం. రెండో దశ – 2026 జనవరి 19 నుంచి 26 వరకు... మూడో దశ – 2026 ఆగస్టు 7 నుంచి 15 వరకు... నాలుగో దశ – 2026 నవంబర్ 1 నుంచి 7 వరకు జరుపుకుందాం. 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వాతంత్ర్య ఉద్యమంలో ఈ గేయం ఇచ్చిన స్ఫూర్తిని అనునిత్యం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.” అని ముఖ్యమంత్రి చెప్పారు.

*దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్రధాని ఆలోచనలు*

“ప్రతి భారతీయుడు గర్వించేలా ప్రధాని పాలన చేస్తున్నారు. మేకిన్ ఇండియా కార్యక్రమాలు ఓవైపు, యోగా వంటి కార్యక్రమాలు మరోవైపు చేపట్టి భారత దేశ కీర్తిని ప్రపంచం మొత్తం చాటారు. విశిష్టమైన ఈ గేయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కార్యక్రమం ప్రకటించిన ప్రధానికి ధన్యవాదాలు. మన సంస్కృతీ సాంప్రదాయాలను, మన పోరాటాలను, చరిత్రను ప్రపంచానికి తెలుపుతున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రధాని ఆలోచనలు చేస్తున్నారు. ప్రపంచ స్థాయి ఉత్పత్తులను మనం తయారు చేసుకోవాలి. 11వ స్థానంలో ఉన్న భారత దేశం.. ప్రస్తుతం నాలుగో అతిపెద్ద వ్యవస్థగా మారింది. మరికొన్ని రోజుల్లో 3వ వ్యవస్థగా మారుతుంది. 2047 నాటికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మారుస్తాం. పేదరికం పోవాలి.. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందుకే వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ పాలసీని ప్రభుత్వం అమలు చేస్తోంది. దేశం నాకేమి ఇచ్చిందని కాదు.. దేశానికి నేనేం చేశానని ఆలోచిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రతి ఒక్క పౌరుడూ బాధ్యతగా ఉండాలి.” అని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు, ఏపీ సృజనాత్మకత-సాంస్కృతిక సమితి ఛైర్ పర్సన్ పొడపాటి తేజస్వినీ, కల్చరల్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

#VandeMataram150
#VandeMataram
#JaiHind
#IndianPride
#150YearsOfVandeMataram
#AksharaSanketham
#MotherIndia
#IndianFreedom
#NationalSong
#IndianCulture
#Bharat
#AndhraPradesh

1
1309 views