ఆటో డ్రైవర్ల నరకయాతన
శ్రీకాకుళం:జిల్లా కేంద్రంలోని కిమ్స్ ఆస్పత్రి సమీపంలో వ్యవసాయ కేంద్రానికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన ఫిట్‌నెస్ సెంటర్ ఆటోడ్రైవర్లకు చుక్కలు చూపిస్తోంది. గవర్నమెంట్ అప్రూవ్డ్ ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్ పేరిట ఏర్పాటు చేసిన ఈ కేంద్రం వద్ద బుధవారం ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు వందలాది ఆటోలు బారులు తీరాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర పథకం మంజూరు చేస్తామని, ఆటో డ్రైవర్లకు రూ. 15000 నగదు జమ చేస్తామని ప్రకటించడం.. చివరి తేదీ సమీపించడంతో జిల్లా నలుమూలల నుంచి వందలకొద్దీ ఆటోలు కేంద్రం వద్ద క్యూకట్టాయి.కమీషన్ చెల్లిస్తే అనుమతి..ఫిట్‌నెస్ సెంటర్ సిబ్బందికి కమీషన్ ఇచ్చిన వారికి మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అటువంటి ఆటోకు మాత్రమే టెస్టింగ్ చేసి బయటకు పంపిస్తున్నారు. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో ఆటోడ్రైవర్లు నిరసనకు దిగారు. టెస్టింగ్ సెంటర్ సిబ్బందిపై తిరగబడ్డారు. కమీషన్ ఇచ్చే పరిస్థితి లేదని, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని వాగ్వాదానికి దిగారు. దీంతో చేసేదేమీ లేక ఫిట్‌నెస్ చేసిన ఆటోలను ఒకసారిగా బయటకు పంపించారు.నా ఆటో ఫిట్‌నెస్ కోసం ఉదయం నుంచి టెస్టింగ్ సెంటర్ వద్ద వేచి ఉన్నాను. కనీసం తాగడానికి మంచినీరు కూడా లేదు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం రూ.2000 అదనంగా సిబ్బందికి చెల్లించాను. అయినప్పటికీ నా ఆటోను లోపలి నుంచి బయటకు అనుమతించలేదు.- తఫ్రీద్, పలాస