logo

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ గణితశాస్త్ర దినోత్సవము...........

తేదీ: 21-12-2024:ఈరోజు కొండాపూర్ డివిజన్ పరిధిలో గల మాదాపూర్ జిల్లా పరిషత్తు హైస్కూల్ నందు విద్యార్థిని, విద్యార్థులకు గణితశాస్త్ర దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గణితశాస్త్ర మేధావి శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పుష్పాంజలితో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన అవగాహన కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ M. బసవలింగం అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం గణితశాస్త్ర ఆచార్యులు P. చిరంజీవిగారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ
" *భారతీయులు సున్నాను, దశాంశ పద్ధతిని ప్రపంచం గణితానికి అందించి గణిత విజ్ఞాన శాస్త్రాభివృద్ధి వేగం పుంజుకోవడానికి కారకులైనారు. ఆధునిక గణిత శాస్త్రవేత్తలు గణితంలో అనేక గ్రంధాలు రచించి గణితశాస్త్రనికి విశేషమైన సేవలు అందించారు. ఆధునిక గణితశాస్త్రవేత్తలలో శ్రీనివాస రామానుజన్ ప్రముఖులు. ఆయన చిన్న వయసులోనే ఆయిలర్ నియమాలు, త్రికోణమితికి చెందిన సమస్యలను సాధించేవారు. G. S. కార్ రచించిన 'సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ ఇన్ ప్యూర్ మాథమెటిక్స్' అనే పుస్తకములోని ఆల్ జీబ్రా, అనలిటికల్ జామెట్రీకి చెందిన క్లిష్టమైన అనేక సిద్దాంతాలను ఎవరి సహాయము లేకుండానే రామానుజన్ నేర్చుకున్నారు. బెర్నౌలి* *సంఖ్యలు, ఆయిలర్ స్థిరాంకము, ఎలిప్టిక్ ఇంటెగ్రల్స్, అనంత లబ్ధాలు, అనంత శ్రేణులపై రామానుజన్ చేసిన పరిశోధనల వల్ల G. H. హార్డీ గారు ఆయనను కేంబ్రిడ్జి యూనివర్శిటీకి ఆహ్వానించారు. హార్డీ, రామానుజన్ కలిసి నిరూపించున సిద్ధాంతాలు బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి.* *ఇందుకుగాను శ్రీనివాస రామానుజన్ 'ఫెలో ఆఫ్ ట్రినిటీ కాలేజీ'గా ఎన్నికైన తొలి భారతీయునిగా, 'ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ'గా ఎన్నికైన రెండవ భారతీయునిగా గౌరవం పొందారు. రామానుజన్ భారతదేశానికి తిరిగి వచ్చాక ఈయన జీవిత* *చరమాంకంలో 'మాక్ తీటా ప్రమేయాల' మీద పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలు ఈనాటి స్ట్రింగ్ సిద్ధాంత సంబంధిత విషయాలపై మెరుగైన అవగాహనకు ఉపయోగ పడుతున్నవి. వీరి జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఒక చలనచిత్రం నిర్మింపబడినది. ఆయన జీవితచరిత్ర 'ద మ్యాన్ హు న్యూ ఇన్ఫినిటీ' అనేక భాషలలో తర్జుమా అయింది. తెలుగులో ఆ పుస్తకాన్ని శ్రీ P. V. అరుణాచలం గారు 'అనంతం తెలిసిన వ్యక్తి' అనే పేరుతో తర్జుమా చేశారు. శ్రీనివాస రామానుజన్*
*గణితశాస్త్రానికి చేసిన సేవలను గుర్తించి భారతప్రభుత్వం ఆయన గౌరవార్ధం ఆయన జన్మదినమైన డిసెంబరు 22ను 2012 నుండి జాతీయ గణితశాస్త్ర దినోత్సవముగా ప్రకటించి అమలు చేయుచున్నారు"* అని తెలిపారు. " *గణితం అన్ని శాస్త్రాలకు తల్లి వంటిది. గణితశాస్త్రం లేకుండా ప్రపంచం ఏ రంగంలోను ముందంజ వేయలేదు. గణితం మన దైనందిన సమస్యల పరిష్కారంతో పాటు శాస్త్ర, సాంకేతిక, ఆర్థిక, వైద్య, సైబర్ భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సి, ఇంజనీరింగ్, వ్యాపార రంగాలలో మరియు సామాజిక స్థితిగతులను గుర్తించి లెక్కవేయడం ఇలా బహుముఖ రంగాలలో ఉపయోగపడుతూ ఉంది. నేటి విద్యార్థులు రామానుజం జీవితాన్ని ఆదర్శంగా తీసికొని గణితశాస్త్రంలో రాణించాలి* " అని కోరారు. " *గణితశాస్త్రంలో ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి"* అని తెలిపారు.
" *విద్యార్థులు చెడు అలవాట్లకు (ధూమపానం, మద్యపానము, మాదకద్రవ్యాల వినియోగం, సోషల్ మీడియా) దూరంగా ఉంటూ విలువలతో కూడిన గుణాత్మక విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలి* " అని కోరారు.

ఈ కార్యక్రమంలో సహాయ ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్, అధ్యాపకులు నరోత్తమ రెడ్డి, సత్యనారాయణ, మధుసూదన్ రెడ్డి, అనిల్ కుమార్, మహేందర్ మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కొత్తపల్లి కోటేశ్వరరావు (ఫార్మర్ డిప్యూటీ రిజిస్ట్రార్, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ) పాల్గొన్నారు.

42
3127 views