logo

మంత్రి రోజా నగరి నియోజకవర్గంలో వైసీపీ ముఖ్య నేత మురళీధర్ రెడ్డి సస్పెండ్

Vadamalapeta Ysrcp Zptc Suspended: ఏపీ మంత్రి ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నేత సస్పెన్షన్ చర్చనీయాంశమైంది. వడమాల పేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భరత్ తెలిపారు. మురళి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మంత్రి రోజాకు టికెట్ ఇవ్వొద్దంటూ మురళీధర్ రెడ్డి గతంలో వైఎస్సార్‌సీపీ అధిష్టానానికి విన్నవించారు.
ప్రధానాంశాలు:
నగరి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నేతపై వేటు
వడమాల పేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి సస్పెండ్
పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. మంత్రి రోజాకు టికెట్ ఇవ్వొద్దంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన నేతపై వేటు పడింది. వడమాల పేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భరత్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేసినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై మురళీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉంటే ఇలా సస్పెండ్ చేయడం దారుణమన్నారు.
జెడ్పీటీసీ మురళీధర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గమని స్థానికంగా చెప్పుకుంటారు. ఎన్నికల సమయంలో మండలస్థాయి నేతను సస్పెండ్ చేయడం నగరి నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. మురళీ కొంతకాలంగా మంత్రి రోజాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆమెకు టికెట్ కేటాయించొద్దని అధిష్టానాన్ని కోరారు.. కొద్ది రోజులు మంత్రితో ప్రోటోకాల్ విషయంలోనూ విభేదాలు నడిచాయి. రోజా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ విమర్శలు చేశారు. మంత్రి రోజా మాత్రం ఇవన్నీ పట్టించుకోలేదు.. ఒకటి, రెండు సందర్భాల్లో మాత్రం తన వ్యతిరేక వర్గం మొత్తానికి కలిపి కౌంటరిచ్చారు.
మురళీధర్ సస్పెన్షన్ సంగతి అలా ఉంటే.. ఆయన వర్గం మొత్తం ఇప్పటికే టీడీపీలో చేరిందంటూ నగరి నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. అయినా సరే మురళి మాత్రం పార్టీలోనే కొనసాగుతున్నారు.. పోలింగ్‌కు మరో 10 రోజుల సమయం మాత్రమే ఉన్న సమయంలో పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ సస్పెన్షన్‌ తర్వాత మురళీధర్ రెడ్డి అడుగులు ఎటువైపు అనే చర్చ నడుస్తోంది.
జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి ఇటీవల మంత్రి రోజాకు వ్యతిరేకంగా తిరుపతిలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. తాను ప్రారంభించిన కొత్త భవనాలను మళ్లీ రోజా మంత్రి హోదాలో ప్రారంభించడం విడ్డూరంగా ఉందని.. ఇది తనకు ఘోర అవమానం అన్నారు. మంత్రి తీరుతో నియోజకవర్గంలో నేతలు అసంతృప్తితో ఉన్నారని.. ఎమ్మెల్యే టికెట్‌ను రోజాకు కాకుండా స్థానికులకు ఇస్తే గెలిపించుకుంటామని అప్పుడే అధిష్టానానికి చెప్పారు. తమను రోజా ఇబ్బంది పెడుతున్నారని చెప్పుకొచ్చారు.
నగరి నియోజకవర్గంలో మంత్రి రోజాకు మొదటి నుంచి వర్గపోరుతో సతమతం అవుతున్నారు.. ఓ వైపు ఈడిగ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్ కేజే శాంతి, ఆమె భర్త కుమార్ వర్గం.. మరోవైపు శ్రీశైలం ట్రస్ట్ ఛైర్మన్ చక్రపాణి రెడ్డి, వడమాలపేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డితో పాటూ పలువురు నేతలతో విభేదాలు ఉన్నాయి. అయితే సీఎం జగన్ ఒకటి, రెండు సందర్భాల్లో వర్గపోరు పక్కన పెట్టి నేతలంతా కలిసి పనిచేయాలని సూచించారు. సీఎం గతేడాది నగరి పర్యటనకు వచ్చిన సమయంలో మంత్రి రోజా, కేజే శాంతి చేతులు కలిపే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా వారి చేతులను పట్టుకుని కలిపారు.. అయినా సరే వర్గపోరు ఆగలేదు. ఆ తర్వాత కూడా అసమ్మతి వర్గం, మంత్రి రోజా పార్టీ కార్యక్రమాలను నగరి నియోజకవర్గంలో వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికల సమయంలో అసమ్మతి వర్గంలోని జెడ్పీటీసీ సస్పెన్షన్ ఆసక్తికరంగా మారింది.

10
1217 views