ఆళ్లగడ్డలో సమ్మర్ కోచింగ్ క్యాంప్: క్రీడాకారులకు పౌష్టికాహారం పంపిణీ.
AIMA మీడియా.నంద్యాల జిల్లా.. గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమ్మర్ కోచింగ్ క్యాంపులను నిర్వహిస్తోంది. మే 1వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు జరిగే ఈ శిక్షణా శిబిరాల్లో అనుభవజ్ఞులు, నిష్ణాతులైన సీనియర్ క్రీడాకారులు, కోచ్‌ల చేత క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు ప్రభుత్వం క్రీడా సామగ్రి తో పాటు పౌష్టికాహారంగా చిక్కీలను కూడా అందజేస్తోంది.ఈ సమ్మర్ క్యాంపులో భాగంగా ఆదివారం ఉదయం ఆళ్లగడ్డ పట్టణంలోని ఎద్దుల పాపమ్మ కాలేజీ గ్రౌండ్ నందు స్థానిక ఫుట్‌బాల్ క్రీడాకారులకు సీనియర్ క్రీడాకారుడు, ఏపీఎస్పీ పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న సదా వెంకట కుమార్ తన స్వంత ఖర్చులతో అదనపు పౌష్టికాహారంగా అరటిపండ్లు, గుడ్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సదా వెంకట కుమార్ మాట్లాడుతూ. క్రీడల్లో రాణించాలనుకునే వారికి పౌష్టికాహారం అత్యంత అవసరమని, ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌తో పాటు మంచి ఆహార నియమాలు పాటించాలని పిలుపునిచ్చారు. సమ్మర్ క్యాంపులో క్రీడాకారులకు సేవ చేసే ఈ గొప్ప అవకాశాన్ని కల్పించిన కోచ్ డి.పి. సుబ్బారాయుడుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా క్రీడాకారుల అభివృద్ధి కోసం, ఆటల పురోభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కోచ్, సుబ్బారాయుడు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.