logo

1000 ఏండ్ల నాటి ఆలయం.. ఆ గుడిలో ఒక్క సీన్ తీసినా సినిమా హిట్టే

మన దేశంలో ఉన్న ఒక్కో ఆలయానికి ఒక్క ప్రత్యేకత ఉంటుంది. వాటిలో కొన్ని చారిత్రకంగా గుర్తింపు పొందితే, మరి కొన్ని స్థలపురాణం వల్ల ప్రసిద్ధి పొందాయి.
మరికొన్ని ఆలయాలు శిల్పకళ వల్ల గుర్తింపు పొందాయి. కానీ ఓ ఆలయం మాత్రం సినిమా షూటింగులతో చాలా ఫేమస్ అయ్యింది. ఇంతకీ ఆలయం ఎక్కడుంది అనుకుంటున్నారా.. అదేనండి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్న అమ్మపల్లి సీతారామాలయం. ఈ ఆలయం సినిమా షూటింగులు, పెళ్లిళ్లు జరిగే స్పాట్‌గా చాలా పాపులర్ అయ్యింది.

ఈ ఆలయం హైదరాబాద్‌ నుంచి సుమారు 30 కిలోమీటర్లు, శంషాబాద్‌ బస్‌స్టాప్‌ నుంచి 5 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ఈ గుడిని 13వ శతాబ్దంలో వేంగి రాజులు కట్టించారని పురాణాలు చెబుతున్నాయి. గర్భగుడిలో ఉన్న శ్రీరాముడి విగ్రహం దాదాపు వెయ్యేళ్ల పాతదట. ఈ గుడికి 7 అంతస్తుల గోపురం, గోపురం పై భాగంలో శేషతల్పసాయిగా విరాజిల్లే విష్ణుమూర్తి విగ్రహం, చుట్టూ పెద్ద కారిడార్‌, మకర తోరణాలు ఇవన్నీ చూడడానికి అద్భుతంగా ఉంటాయంటున్నారు అక్కడికి వెళ్లే భక్తులు.

ఇక మరో విషయం ఏంటంటే సాధారణంగా రాములవారి గర్భగుడిలో హనుమంతుడు కూడా ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం హనుమంతుడు గర్భగుడిలో కాకుండా బయట ధ్వజస్తంభం దగ్గర దర్శనమిస్తాడు. ఆలయం చుట్టూ పచ్చని కొబ్బరి తోటలు, పాత కోనేరు ఉంటాయి. మొత్తం గుడి దాదాపు 9 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ సీతమ్మవారు కొలువై ఉండడంతో ఈ ఊరికి అమ్మపల్లి అని పేరు వచ్చిందట. ఇక్కడి రాములు కళ్యాణ రాముడిగా, సీతమ్మవారు సంతాన ప్రసాదినిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. పెళ్లి కావాలనుకునే వాళ్లు, సంతానం కోసం ప్రార్థించే వాళ్లు ఇక్కడికి వచ్చి మొక్కితే చాలు తీరిపోతుందంటున్నారు భక్తులు.

ఈ ఆలయంలోని రాముడు కుడి చేతిలో బాణాలు, ఎడమచేతిలో విల్లు పట్టుకుని కోదండ రాముడిగా కనిపిస్తాడు. ఆలయం ముఖమంటపంలో కూర్మం విగ్రహం ఉండడం వల్ల గుడి దర్శనం మోక్షం ఇస్తుందన్న నమ్మకం ఉంది. గరుత్మంతుడు విగ్రహం కూడా ఇక్కడే ఉంటుంది.

ఇది సినిమా గుడి !

ఇక ఈ ఆలయంలో మరో విశేషం గురించి చెప్పాలంటే ఇక్కడ షూటింగ్ చేసిన సినిమాలు కచ్చితంగా హిట్టవుతాయన్న నమ్మకం సినిమా వర్గాల్లో బలంగా ఉంది. ముఖ్యంగా 'మురారి' సినిమా ఇక్కడ షూట్ చేసి సూపర్‌ హిట్ అవడంతో, తర్వాత చాలాసినిమాలు ఇక్కడే కొన్ని సన్నివేశాలు తీశారట. కనీసం ఒక్క సీన్ అయినా ఇక్కడ తీస్తే సినిమా సక్సెస్ అవుతుందన్న నమ్మకం కూడా ఉంది. అలాగే ఇక్కడ వివాహాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక్కడ పెళ్లి చేసుకుంటే పుణ్యం కలుగుతుందని భావిస్తారు. అలా చారిత్రాత్మకంగా, పౌరాణికంగా, సినిమాల వల్ల అన్నీ కలిపి ఈ అమ్మపల్లి సీతారామాలయంకి ఓ ప్రత్యేకమైన స్థానం, గుర్తింపు వచ్చింది.

5
104 views