logo

కొత్త పుంతలు తొక్కుతున్న ఏపీ లిక్కర్ స్కాం? నెక్స్ట్ అరెస్ట్?

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం(Andhra Pradesh liquor scam) కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసు విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
దేశంలో ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే 10 రెట్లు ఎక్కువ ఈ ఏపీ మద్యం కుంభకోణం జరిగిందని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. దేశంలో ఎక్కడైనా గానీ విక్రయించే మద్యంలో ఆల్కహాల్ ఉంటుంది. కానీ జె-బ్రాండ్స్‌లో మాత్రం పైరోగలాల్, డై ఇథైల్‌ థాలేట్‌, ఐసోపులెరిక్‌ యాసిడ్ వంటి హానికారక రసాయనాలు ఉన్నట్లు తేలింది. దీంతో ఈ మద్యం తాగిన వారికి మూడేళ్లలోనే లివర్, కిడ్నీపరమైన సమస్యలు - కడుపులో, నోట్లో పుండ్లు పడటం, తాగిన తర్వాత పిచ్చి పిచ్చిగా వ్యవహరించడం జరిగింది. ఆసుపత్రులపాలై రూ.5 లక్షల వరకు ఖర్చు చేసినవారు వేలమంది ఉన్నారు.

మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్ర :

మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు జరిపి ముడుపులు ఇచ్చిన సంస్థలకే సరఫరా ఆర్డర్లు దక్కేలా చూసి మద్యం కంపెనీల నుంచి వసూలు చేయడంలో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. పాలసీ రూపకల్పన నుంచి వసూళ్ల వరకు పాత్ర మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఐఆర్ఎస్ అధికారి వాసుదే వరెడ్డిని డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చి ఏపీఎస్ బీసీఎల్ ఎండీగా, డిస్టిలరీస్, బ్రూవరీస్ కమిషనర్‌గా నియమించటంలో, ఎక్సైజ్ శాఖాధికారి డి.సత్యప్రసాద్‌కి కన్ఫర్డ్ ఐఏఎస్‌గా పదోన్నతి కల్పిస్తానని ప్రలోభపెట్టి.. ఆయన్ను పావుగా వాడుకుని దోపిడీ సాగించటంలో మిథున్ రెడ్డిది ప్రధాన పాత్ర. మద్యం బ్రాండ్ల మూల ధర ఆధారంగా కేసుకు రూ.150 నుంచి రూ.600 వరకు ముడుపులు వసూలు చేయొచ్చని, తద్వారా నెలకు రూ.50-60 కోట్ల మేర వస్తాయని మిథున్ రెడ్డి, నాయకత్వంలోనే నిర్ణయించారు. ముడుపుల్లో అత్యధిక శాతం బంగారం, నగదు రూపంలోనే తీసుకున్నారు. ముడుపుల వసూళ్లు, సొంత బ్రాండ్ల మద్యానికి ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చుకోవటం ద్వారా మిధున్ రెడ్డి రెండు విధాలా లబ్ది పొందారు.

'నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ (డిస్టిలరీ) వ్యాపార పునరుద్ధరణ, అభివృద్ధి కోసం అరబిందో గ్రూప్ ద్వారా రూ.45 కోట్ల రుణమిప్పించడంతో కీలక పాత్ర ఎంపీ మిథున్ రెడ్డిదే.. మద్యం ముడుపుల్లోప్రతినెల రూ.5 కోట్లను ఎంపీ మిథున్ రెడ్డి తన వాటాగా.. తమ కుటుంబీ కులు డైరెక్టర్లుగా ఉన్న PLR ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాల్లో జమ చేయించుకున్నారు. లిక్కర్ స్కాంలో దోచుకున్న డబ్బును మిథున్ రెడ్డి 2024 ఎన్నికల్లో నియోజకవర్గాలకు తరలించారు.

మద్యం కుంభకోణంలో జగన్ పాత్ర :

సిట్ దాఖలు చేసిన 305 పేజీల ప్రాథమిక చార్జిషీట్‌లో జగన్ మోహన్ రెడ్డి పేరు స్పష్టంగా ప్రస్తావించబడింది. ఈ కుంభకోణంలో నిందితులంతా జగన్‌కు సన్నిహితులేనని, జగన్ ఆదేశాల మేరకు స్కామ్ నడిచినట్లు సిట్ వెల్లడించింది. మద్యం పాలసీ మార్చి ప్రభుత్వ దుకాణాలు పెట్టించి ఊరు పేరు లేని బ్రాండ్లను అధిక ధరలకు విక్రయించారు. నాసిరకం మద్యం తయారీ కంపెనీల నుంచి వేల కోట్లు కమిషన్ల రూపంలో దోచుకున్నారు. మద్యం తయారీ కంపెనీల నుంచి కమీషన్ల రూపంలోనే ఒక మద్యం కేసుపై రూ.250, బీరు కేసుపై రూ.150 చొప్పున ఐదేళ్లలో రూ.3,500 కోట్లు జగన్ రెడ్డి కోటరీలో ఉన్న నేతలు దోచుకున్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (NDPL) ద్వారా డిస్టిలరీలు, బ్రూవరీల్లో తయారైన మద్యాన్ని మద్యం డిపోలకు పంపకుండా నేరుగా షాపులకు పంపి తద్వారా వచ్చిన నగదును దారి మళ్లించారు. మాన్షన్ హౌస్ బ్రాందీని సరఫరా చేసే తిలక్ నగర్ ఇండ్రస్ట్రీస్ నుంచి కేస్ కు రూ.20 చొప్పున రూ.280 కోట్లు ముడుపులు తీసుకున్నారు. దానిలో సుమారు రూ.196 కోట్లు బంగారం రూపంలో దోచుకున్నారు.

మద్యం కుంభకోణంలో రాజ్ కెసిరెడ్డి పాత్ర :

మద్యం తయారీ కంపెనీల నుంచి ముడుపుల వసూల్ల నెట్ వర్క్‌లో కీలకం కెసిరెడ్డి రాజశేఖరరెడ్డి (రాజ్ కెసిరెడ్డి)దే.. డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా హవాలా మార్గంలో సైఫ్ అహ్మద్, చాణక్య, వరుణ కుమార్, బొల్లారం శివకుమార్, అవినాష్ రెడ్డి (సుమిత్)ల సహాయంతో మద్యం తయారీ కంపెనీల నుంచి నెలకు రూ.50-60 కోట్ల ముడుపులను విదేశాలకు తరలించారు. రాజ్ కెసిరెడ్డి మద్యం సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపులను చెవిరెడ్డి సన్నిహితుడు సీహెచ్. వెంకటేష్ నాయుడు హైదరాబాద్‌లో దాచేవారు. ముడుపుల చెల్లింపులకు ముడిసరకు సరఫరా చేసే సంస్థలనూ వాడుకున్నారు.. ఉదాహరణకు సీసాలు, కాటన్ బాక్సుల వంటి సరఫరా సంస్థలకు లెక్క ప్రకారం ఒక రూ. కోటి చెల్లించాలనుకుంటే రూ.15కోట్లు ఇచ్చేవారు.. కోటి ఆ కంపెనీకి, మిగిలిన 14 కోట్లు దొడ్డిదారిన కెసిరెడ్డి టీమ్‌కు చేరేవి. మద్యం ద్వారా సంపాదించిన అక్రమ సొమ్ముతో చెవిరెడ్డి, రాజ్ కెసిరెడ్డి ఆఫ్రికాలో (జాంబియా, టాంజానియా, జింబాబ్వే) మైనింగ్ వ్యాపారం ప్రారంభించేందుకు ప్రణయ్ ప్రకాశ్‌తో కలిసి అంతర్జాతీయ కుంభకోణానికి పాల్పడ్డారు. మద్యం ముడుపుల సొమ్ముతో బెంగళూరులో స్థిరాస్తి రంగంలో రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. మద్యంలో దోచుకున్న ముడుపులను స్థిరాస్తి, విద్యుత్ రంగంలో, పలు ఆసుపత్రుల్లో, ఈడీ క్రియేషన్స్ ద్వారా సినిమాలు తీసి బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చారు.

మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి పాత్ర :

2024 ఎన్నికల్లో హైదరాబాద్ నుండి తాడేపల్లి, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నగదు తరలించడంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలకపాత్ర పోషించాడు. రూ.200-250 కోట్ల మద్యం ముడుపుల సొమ్మును తరలించడానికి తుడా చైర్మన్ అప్పటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనం (టొయోటా ఫార్చూనర్, AP39 BV 3259)ను ఉపయోగించారు. తాడేపల్లిలోని ల్యాండ్‌మార్క్ అపార్ట్‌మెంట్, రూమ్ నంబర్ 312లో రూ.8-9 కోట్ల విడతలలో సొమ్ము చేర్చేవారు.. ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి ( 2023 నవంబర్ నుంచి 2024 మే వరకు) ఈ అక్రమ సొమ్మును తరలించినట్లు టోల్ గేట్ రికార్డులు తెలియజేస్తున్నాయి. మద్యం ముడుపులను ఎన్నికలకు ముందు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డికి అందించినట్లు కాల్ డేటా రికార్డులు బట్టబయలు అయ్యాయి. మద్యం కుంభకోణంలో సిట్ 11 మందిని అరెస్ట్ ...40 మందిని నిందితులుగా చేర్చింది..214 మందిని విచారించింది.

ఇమిటేషన్ బ్రాండ్లతో బారీ దోపిడీ :

మద్యం ముసుగులో జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన బ్రాండ్లన్నింటినీ తరిమేసి.. అచ్చం అవే పేర్లను తలపించేలా ఒకటి, రెండు అక్షరాలు, పదాలు మార్చి పెద్ద ఎత్తున ఇమిటేషన్ బ్రాండ్లు తీసుకొచ్చి భారీ అవినీతికి పాల్పడ్డారు. ఇప్పటి వరకూ ఈ కుంభకోణంలో వెలుగుచూసిన ముడుపుల సొమ్ముకు మించి ఈ ఇమిటేషన్ బ్రాండ్లుతో వేల కోట్లు కొల్లగొట్టారు. బ్యాగ్ పైపర్ ప్రీమియర్ విస్కీ' అనేది ప్రాచుర్యం పొందిన బ్రాండ్. అచ్చం అదేనని నమ్మించేలా కొత్తగా 'బ్యాగ్ పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ' బ్రాండ్ తీసుకొచ్చారు. ఒక కేసు బ్యాగ్ పైపర్ ప్రీమియర్ విస్కీని ఏపీఎస్ బీసీఎల్ రూ.696కు కొనేది. అలాంటిది నాణ్యతలో దాంతో ఏ మాత్రం సరితూగని, కొత్తగా ప్రవేశపెట్టిన బ్యాగ్‌ పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ ఒక కేసు ధర రూ.1,759కు కొనుగోలు చేసింది. అసలైన బ్రాండ్ ధరకు, దాని స్థానంలో మోసపూరితంగా ప్రవేశ పెట్టిన ఇమిటేషన్ బ్రాండ్ మధ్య ఒక్కో కేసుకు ధరలో ఏకంగా రూ. 1,063 వ్యత్యాసముంది. బకాడీ కార్టా బ్లాంకా వైట్ రమ్ అనే బ్రాండ్ ను చిన్న చిన్న మార్పులు చేసి బకాడీ కార్టా బ్లాంకా అల్ట్రా ప్లాటినమ్ అనే ఇమిటేషన్ బ్రాండ్ తీసుకొచ్చారు.. అసలు బ్రాండ్ మద్యం కేసును ఏపీఎస్ బీసీఎల్ రూ.1,879 కు కొంటే నాణ్యతలో దానికి మాత్రం సరితూగని ఇమిటేషన్ బ్రాండ్ ఒక్కో కేసును రూ.3,075 కొనుగోలు చేసింది..ఒక్కో కేసుపై రూ.1,196 వ్యత్యాసం ఉంది. గత ఐదేళ్లలో ఇలా ఇమిటేషన్ బ్రాండ్ల మద్యం కోట్ల కొద్దీ కేసులు అమ్మి.. మద్యం ముఠా పెద్ద ఎత్తున దోపిడీకి తెగబడింది.

మద్యం ముడుపులతో దుబాయ్ లో కంపెనీలు :

మద్యం కుంభకో ణంలో కొల్లగొట్టిన సొత్తులో రూ. వందల కోట్లను వైకాపా ముఠా హవాలా మార్గాల్లో దుబాయికి తరలించి రాజ్ కెసిరెడ్డి ప్రధాన అనుచరుడు తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి (ఏ9)తో దుబాయ్ లో కంపెనీలు పెట్టారు. దుబాయ్‌లో పెట్టుబడులు పెట్టడానికి వైసీపీ పాలనలో దాదాపు 29సార్లు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి దుబాయ్ వెళ్లాడు. మద్యం కుంభకోణం ప్రధాన నిందులుగా ఉన్న ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్, ముప్పిడి అవినాష్ రెడ్డి, వరుణ్ పురుషోత్తం, బొల్లారం శివకుమార్, ముప్పిడి అనిరుథ్రెడ్డి, నైమన్ ప్రసన్, ప్రణోయ్ ప్రకాశ్ యూఏఈ గోల్డెన్ వీసాలు పొందారు. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తుతో వైకాపా ముఠా తెలంగాణలో భారీగా భూములు కొనుగోలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కెసిరెడ్డి హైదరాబాద్ సమీపంలోని షాబాద్ నగర్ లో ఏకంగా 90 ఎకరాలు కొనుగోలు చేసి వాటిలో 60 ఎకరాలు అమ్మేసి నల్లధనాన్ని వైట్ లోకి మార్చుకోవడం జరిగింది. మిగిలిన 30 ఎకరాలు రాజ్ కెసిరెడ్డికి సంబంధించిన సంస్థ పేరిటే ఉన్నాయి.

నేరం ఇక్కడ.. బ్యాకప్ దుబాయ్ :

ఏయే డిస్టిలరీలకు ఎంతెంత మద్యం సరఫరా ఆర్డర్లు దక్కాయి? వాటి నుంచి ఎంత మేర ముడుపులుగా వసూలు చేయాలి? తదితర లెక్కలు కట్టేందుకు దుబాయ్ కేంద్రంగా వైసీపీ ముఠా దుబాయ్ లో ఓ డెన్‌ను నడిపించింది. ముడుపుల లెక్కలు కట్టేందుకు, వాటి నిర్వహణకు రాజీవ్ ప్రతాప్ అనే వ్యక్తిని దుబాయిలోని డెన్ కు ఇన్ఛార్జ్ నియమించారు. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సిఫార్సుల మేరకు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లోని ఎంఐఎస్ సెక్షన్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా అనూష.. మద్యం విక్రయాల డేటాను ఎప్పటికప్పుడు కెసిరెడ్డి ముఠా సభ్యు డైన సైఫ్ అహ్మద్ కు సిగ్నల్, టెలిగ్రామ్, వాట్సప్ ద్వారా పంపించేవారు. రాజ్ కెసిరెడ్డి ఈ సమాచారాన్ని దుబాయ్ డెన్ నిర్వాహకుడైన రాజీవ్ ప్రతాప్ కు పంపించేవాడు.

కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తు జప్తు :

మద్యం కుంభకోణంలో కొల్ల గొట్టిన సొత్తును సెట్ అదాన్ డిస్టిలరీస్, లీలా డిస్టిలరీస్ సంస్థల బ్యాంకు ఖాతాల్లోని రూ.62 కోట్ల జప్తు చేసేందుకు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది. ఎన్నికల సమయంలో వైకాపా అభ్యర్థులకు పంపిణీ చేసేందుకు వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అనుచరులు హైదరాబాద్ నుంచి ఏపీకి తీసుకొస్తుండగా గరికపాడు చెక్ పోస్టు వద్ద గతేడాది మేలో పట్టుబడ్డ మద్యం ముడుపుల సొమ్ము రూ.8.36 కోట్లు సిజ్ చేయడం జరిగింది. మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడిని సిట్లోకానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది.

0
338 views